రోహిత్ శర్మకి కెప్టెన్ గా మంచి రికార్డు ఉంది. ధోని తర్వాత జట్టుని అంత కూల్ గా నడిపించేది హిట్ మ్యాన్ అని ఫ్యాన్స్ చెప్పుకొస్తారు. అయితే ఇదంతా పక్కన పెడితే రోహిత్ శర్మ డబ్ల్యూటీసీ ఫైనల్లో చిరాకు పడుతూ కనిపించాడు.
భారత్- ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన ఆసీస్ 85 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ట్రావిస్ హెడ్(146), సెంచరీతో కదం తొక్కగా.. స్టీవ్ స్మిత్(95) సెంచరీకి చేరువలో ఉన్నాడు. వీరిద్దరి భారీ భాగస్వామ్యం కారణంగానే తొలిరోజు ఆసీస్ మ్యాచ్ పై ఆధిపత్యం ప్రదర్శించింది. భారత పేసర్లు సిరాజ్, శార్దూలు, షమీకి తలో వికెట్ పడగొట్టారు. ఇక ఈ మ్యాచులో భారత్ తిరిగి పుంజుకోవాలంటే రెండో రోజు తొలి సెషన్ చాలా కీలకం కానుంది. ఈ సెషన్ లో ఎంత త్వరగా వికెట్లు తీయగలిగితే మళ్ళీ కంబ్యాక్ ఇవ్వొచ్చు. ఇదిలా ఉండగా ఈ మ్యాచులో రోహిత్ శర్మ బౌలర్లపై చిరాకు పడుతూ కనిపించాడు.
టాస్ గెలిచి బోర్డు మీద 100 పరుగులైనా చేయకుండానే ఆస్ట్రేలియా ఖవాజా, వార్నర్, లబుషేన్ రూపంలో వికెట్లను కోల్పోయింది. ఈ దశలో భారత్ పట్టు బిగించేలాగే కనబడింది. కానీ హెడ్, స్మిత్ మాత్రం భారీ భాగస్వామ్యంతో ఆసీస్ ని పటిష్ట స్థితిలో నిలిపారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కి అజేయంగా 251 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. భారత్ బౌలర్లు కట్టు దిట్టంగా బౌలింగ్ వేసినా.. ఈ జోడీని విడదీయడంలో విఫలమయ్యారు. ఈ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ చాలా చిరాకు పడ్డాడు. ఇన్నింగ్స్ 39వ ఓవర్ వేస్తున్న సమయంలో అతని చేసిన పని వైరల్ అవుతోంది.
రవీంద్ర జడేజా ఈ ఓవర్ వేయడానికి రెడీ అవుతున్న సమయంలో.. రోహిత్ పక్కనే ఉన్నాడు. ఆ సమయంలో తమ బౌలర్లను ఉద్దేశించి ‘ఏంటయ్యా మీరు?’ (క్యా యార్ తుమ్ లోగ్) అంటూ అటుగా ఉన్న బౌలర్ల వైపు చేతులు చూపించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ఇలా సొంత బౌలర్లపై ప్రతాపం చూపిస్తే ప్రయోజనం ఉండదని, సరైన స్ట్రాటజీలతో బ్యాటర్లను కట్టడి చేయాలని రోహిత్‌కు ఫ్యాన్స్ హితబోధ చేస్తున్నారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్‌ను కంట్రోల్ చేయడంలో టీమిండియా విఫలమవడాన్ని విమర్శిస్తున్నారు. మరి రెండో రోజు టీమిండియా బౌలర్లు ఏం చేస్తారో చూడాలి. రోహిత్ శర్మ చేసిన పని మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.