స్టార్ క్రికెటర్ ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి భారీ చోరీకి పాల్పడ్డారు. ఆ ఇంటి నుంచి దాదాపు రూ. 80 లక్షల విలువైన విదేశీ కరెన్సీ, విలువైన వస్తువులు దోచుకెళ్లారు. ఈ ఘటన మార్చి 5న జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మ్యాచులు ఆడుతూ క్రికెటర్ తన పనుల్లో బిజీగా ఉండగా, అదనుచూసి దొంగలు క్రికెటర్ ఇంట్లో భారీ చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి అందినకాడికి దోచుకెళ్లారు. ఖంగారు పడకండి.. ఇది జరిగింది పాకిస్తాన్ లో.. పాక్ మాజీ ఆల్‌రౌండర్ మహమ్మద్ హఫీజ్ ఇంట్లో ఈ దొంగతనం జరిగింది. ఈ ఘటన మార్చి 5న తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే, దీనిపై హఫీజ్ భార్య తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దొంగతనం జరిగే సమయంలో హఫీజ్, అతని భార్య ఇంట్లో లేరు. హఫీజ్ పీఎస్ఎల్ మ్యాచులు ఆడుతూ బిజీగా ఉండగా, అతని భార్య పనిమీద వేరే పట్టణానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఉదయం చోరీ జరిగినట్లు గుర్తించిన వారి సమీప బంధువు షాహిద్ ఇక్బాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మార్చి 5న తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల ప్రాంతంలో ఈ దొంగతనం జరిగిందని ఆయన పోలీసులకు తెలిపారు. దుండగలు 5,000 UAE దిర్హామ్‌లు, 20,000 US డాలర్లు, 4,000 బ్రిటిష్ పౌండ్లు మరియు 3,000 యూరోలను అపహరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటి విలువ పాక్ కరెన్సీలో దాదాపు రూ. 80 లక్ష్లపైనే ఉంది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సెక్షన్ 380, 457 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Robbery has been emerged in Pakistan cricketer Muhammad Hafeez home FIR has been registered against unknown offenders pic.twitter.com/AYzRQgIyhb
— The Hood (@AsiaThehood) March 7, 2023
కాగా, ఆల్‌రౌండర్‌గా విశేష సేవలందించిన హఫీజ్ 2022 జనవరి 3న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. 2018లో టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన హఫీజ్, ఆ తర్వాత వన్డేలు, టీ20ల్లో కొనసాగాడు. దాదాపు 18 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన హఫీజ్ పాకిస్థాన్ తరఫున అన్ని ఫార్మాట్లు కలిపి 392 మ్యాచ్‌లు ఆడి 12,780 రన్స్ చేశాడు. 253 వికెట్లు తీశాడు. ప్రస్తుతం హఫీజ్ పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఆ జట్టు ప్రదర్శన చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. ఆడిన 9 మ్యాచుల్లో క్వెట్టా గ్లాడియేటర్స్ కేవలం మూడు విజయాలు మాత్రమే అందుకుంది. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.