పూణే వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో టీ20లో టీమిండియా 16 పరుగుల తేడాతో ఓటమి చెందిన విషయం మనందరికి తెలిసిందే. దాంతో తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విమర్శల వర్షం కురిపించారు మాజీలు, సగటు క్రికెట్ అభిమానులు. తొలి మ్యాచ్ లోనే చివరి ఓవర్ అక్షర్ ఇచ్చి తప్పు చేశాడని పాండ్యాని విమర్శించారు.. ఇక ఈ మ్యాచ్ లో పాండ్యా అద్బుతంగా బౌలింగ్ చేసినప్పటికీ తన కోటా పూర్తి ఓవర్లు బౌలింగ్ చేయలేదు. పైగా బౌలర్లను సరిగ్గా ఉపయోగించుకోలేక పోయాడు అన్న అపవాదు కూడా ఉంది. ఈ విమర్శల నేపథ్యంలో పాండ్యాకు అండగా నిలిచాడు టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. హార్దిక్ చాలా తెలివైన క్రికెటర్ అంటూ కితాబిచ్చాడు.
శ్రీలంకతో జరుగుతున్న మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ కు పాండ్యా నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక టీమిండియాకు ఏడు టీ20 మ్యాచ్ ల్లో సారథిగా వ్యవహరించాడు పాండ్యా. కెప్టెన్ గా పాండ్యా రికార్డు బాగానే ఉంది. తాను కెప్టెన్ గా చేసిన మ్యాచ్ ల్లో కేవలం తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో మాత్రమే టీమిండియా ఓటమి పాలైంది. అయితే లంకతో జరిగిన రెండు మ్యాచ్ ల్లో ఒక మ్యాచ్ గెలిచినప్పటికీ.. టీమిండియా ప్రదర్శనపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా పాండ్యా కెప్టెన్సీ పై. అయితే ఇన్ని విమర్శల నేపథ్యంలో పాండ్యాకు అండగా నిలబడ్డాడు రవిచంద్రన్ అశ్విన్.
అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ..”హార్దిక్ పాండ్యాలో గొప్ప సారథికి ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి. పాండ్యా ధోనిలాగే కూల్ గా ఉంటాడు. అలాగే చాలా తెలివైన వాడుకూడా. ఇక పాండ్యాలో నాకు నచ్చే అంశాలు.. అతడు ఎలాంటి పరిస్థితుల్లో అయిన చాలా కూల్ గా, రిలాక్స్ గా ఉండటం. కెప్టెన్ ఇలా ఉంటే జట్టులో కూడా వాతావారణ చాలా అద్భుతంగా ఉంటుంది” అని అశ్విన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ఇక నిర్ణయాత్మకమైన మూడో టీ20 మ్యాచ్ శనివారం(జనవరి7) జరగనుంది. అయితే జట్టులోని యంగ్ ప్లేయర్స్ కు ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలియజేస్తున్నట్లు పాండ్యా మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు. ఇలాంటి మ్యాచ్ ల్లో ఒత్తిడిని జయిస్తే.. తర్వాత వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో దానిని ఎదుర్కొంటారని పాండ్యా తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.