సూర్య కుమార్ యాదవ్.. ప్రస్తుతం పొట్టి క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు మారుమ్రోగుతోంది. స్కై అనే పేరుకు తగ్గట్లు సూర్యకుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. 2022 ఏడాది జోష్ ని 2023లో కూడా కొనసాగిస్తున్నాడు. శ్రీలంక మీద 45 బంతుల్లో శకతం పూర్తి చేసి మరోసారి సూర్య క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. అతని బ్యాటింగ్ తీరు, అతని షాట్స్ చూసి హేమాహేమీ బౌలర్లు కూడా స్కై బౌలింగ్ అంటే మా వల్ల కాదు అనే పరిస్థితి క్రియేట్ చేశాడు. ఇప్పుడు పాక్ మాజీ కెప్టెన్ సూర్య కుమార్ విషయంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఇండియన్ క్రికెటర్ల టాలెంట్ ను ఎవరూ పొగిడినా పొగడక పోయినా కూడా పాకిస్తాన్ క్రికెటర్లు, మాజీలు పొగుడుతుంటే మన వాళ్లకు ఎందుకో సంతోషంగా ఉంటుంది. ఫ్యాన్స కూడా వారి పొగడ్తలను తెగ వైరల్ చేస్తుంటారు. ఇప్పుడు పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ వ్యాఖ్యలు వైరల్ కావడమే కాదు.. పాకిస్తాన్ లో పెద్దఎత్తున చర్చకు కూడా దారి తీశాయి. ఒకవైపు స్కైని పొగుడుతూనే సల్మాన్ భట్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు చురకలు అంటించాడు. వారి తీరును ప్రపంచవ్యాప్తంగా ఎండగట్టాడు.
“సూర్య కుమార్ యాదవ్ భారత్ లో పుట్టినందుకు అదృష్టవంతుడు అనే చెప్పాలి. అతను 30 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టాడని చాలాచోట్ల చదివాను. అదే పాకిస్తాన్ లో పుట్టుంటే అసలు జాతీయ జట్టులో అడుగు కూడా పెట్టేవాడు కాదు. ఇక్కడి 30 ఏళ్ల పాలసీకి సూర్య కుమార్ లాంటి టాలెంట్ ఉన్న ప్లేయర్ బాధితుడు కావాల్సి వచ్చేది. సూర్య కుమార్ కేసు చాలా ప్రత్యేకమైనది. అతని ఫిట్ నెస్, బ్యాటింగ్ స్టైల్ అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. బౌలర్ ఏ బంతి వేయబోతున్నాడో అతని ముందే తెలుసు అన్నట్లుగా బ్యాటింగ్ చేస్తాడు” అంటూ స్కైని సల్మాన్ పొగడ్తలతో ముంచెత్తాడు.
పాకిస్తాన్ క్రిికెట్ బోర్డు ఛైర్మన్ గా రమీజ్ రాజా ఉన్న సమయంలో 30 ఏళ్ల పాలసీని తీసుకొచ్చారు. అంటే.. 30 ఏళ్లలోపు నీకు జాతీయ జట్టులో అవకాశం రాకపోతే ఇంక ఆశలు వదిలేసుకోవాల్సిందే. 30 ఏళ్లు దాటిన వారికి జాతీయ జట్టులే చేరే అవకాశం లేకుండా చేశారు. ఇప్పుడు సల్మాన్ భట్ అటు సూర్య కుమార్ బ్యాటింగ్ ని పొగుడుతూనే అతడిని ఉదాహరణగా చూపిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి పరోక్షంగా చురకలు అంటించాడు. సల్మాన్ భట్ చేసిన వ్యాఖ్యలు అటు పాకిస్తాన్ లో కూడా వైరల్ అవుతున్నాయి.
ఇంక సూర్య బ్యాటింగ్ విషయానికి వస్తే.. శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో రికార్డులు క్రియేట్ చేశాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో 3 శతకాలు సాధించిన తొలి నాన్ ఓపెనర్ గా సూర్య రికార్డుల కెక్కాడు. అంతేకాకుండా కెరీర్ లో 1500 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యంత వేగంగా 1500 పరుగులు పూర్తి చేసుకున్న ప్లేయర్ గా మారాడు. కేవలం 843 బంతులు మాత్రమే ఎదుర్కొని 1500 పరుగులు సాధించాడు. ఇంక ఇన్నింగ్స్ పరంగా చూసుకుంటే సూర్య కుమార్ యాదవ్ 43 ఇన్నింగ్స్ లో 1500 పరుగులు పూర్తి చేసుకుంటే.. బాబర్ మాత్రం 39 ఇన్నింగ్స్ లోనే 1500 పరుగులు సాధించాడు.