రావల్పిండి వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మొదటి టెస్టులో ఇంగ్లాండ్ ఘన విజయాన్ని అందుకుంది. రికార్డులు బద్దలైన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 74 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 15 నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనుకున్న సమయంలో ఇంగ్లాండ్ బౌలర్లు అద్బుత ప్రదర్శనతో మ్యాచ్ గెలిపించారు. స్పిన్నర్ జాక్ లీచ్ నసీం షాను ఎల్బీగా ఔట్ చేయడంతో ఇంగ్లాండ్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత.. ఇంగ్లాండ్ జట్టు టెస్టు క్రికెట్ ఆడేందుకు పాక్ గడ్డపై అడుగుపెట్టడమే ఈ సంబరాలకు కారణం.
బ్రెండన్ మెక్‌కల్లమ్(కోచ్)- బెన్ స్టోక్స్(కెప్టెన్) బాధ్యతలు తీసుకున్నాక.. ఇంగ్లాండ్ ఆటగాళ్ల ఆటతీరే మారిపోయింది. ‘బజ్ బాల్’ పేరుతో దూకుడు మంత్రాన్ని జపిస్తున్నారు. టెస్ట్ మ్యాచ్ అన్నది మరిచిపోయినట్లుగా.. టీ20 స్టయిల్లో ఎడా.. పెడా బాధేస్తున్నారు. ఈ టెస్ట్ ప్రారంభమైన తొలిరోజే.. 504 పరుగులు చేశారంటే అర్థం చేసుకోవచ్చు.. వీరి ఆట ఏ రేంజులో ఉంటుందన్నది. అయితే చివరి రోజు టీ బ్రేక్ వరకు మ్యాచ్ పాకిస్తాన్ వైపే ఉంది. తిరిగి ఆట ప్రారంభయ్యాక.. పాకిస్తాన్ పతనం మొదలయ్యింది. ఆఖరి సెషన్ లో విజయానికి 85 పరుగులు అవసరం కాగా.. 10 పరుగులు మాత్రమే జోడించి 74 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ ఓటమిపై పాక్ సారధి బాబర్ ఆజాం స్పందించాడు.
A WIN FOR THE AGES!! 🦁🦁🦁
🇵🇰 #PAKvENG 🏴 pic.twitter.com/r3QlEHwAXd
— England Cricket (@englandcricket) December 5, 2022
గెలిచే అవకాశాన్ని చేజేతులా కోల్పోయామన్న బాబర్, వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడమే దెబ్బ తీసిందన్నాడు. “టీ బ్రేక్ వరకు మ్యాచ్ మా వైపే ఉంది. అనంతరం వరుసగా వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ పై పట్టు కోల్పోయాం. తొలి ఇన్నింగ్స్ లో హారిస్ రౌఫ్ గాయపడటం కొంచెం ప్రభావాన్ని చూపింది. మా బౌలింగ్ లైనప్ అంతా యువకులే. ప్రత్యర్థి ఆటగాళ్లు ఓవర్‌కి 7 రన్ రేట్ చొప్పున బ్యాటింగ్ చేస్తున్నా.. బాగా బౌలింగ్ చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో గెలిచే అవకాశం వచ్చింది. కానీ, సరైన భాగస్వామ్యాలు రాక ఓడాం. ఈ మ్యాచులో బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోను మంచిగా రాణించాం..” అని బాబర్ చెప్పుకొచ్చాడు.
ENGLAND CLINCH ONE OF THEIR GREATEST OVERSEAS TEST VICTORIES! #PAKvENG pic.twitter.com/rT54CRyhtV
— ESPNcricinfo (@ESPNcricinfo) December 5, 2022
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. క్రాలే (122), బెన్ డకెట్(107), ఓలి పోప్(108), హ్యారీ బ్రూక్ (153).. ఇలా నలుగురు ఆటగాళ్లు సెంచరీలు చేయడంతో 657 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం పాకిస్థాన్ సైతం గట్టిపోటీ ఇచ్చింది.అబ్దుల్లా షఫిక్ (114), ఇమాముల్ హక్(121), బాబర్ ఆజాం(136) సెంచరీలు చేయడంతో 597 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు 78 పరుగుల ఆధిక్యం లభించింది. దాంతో, మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బెన్‌స్టోక్ రెండో ఇన్నింగ్స్‌ను 264-7 వద్ద డిక్లేర్ చేశాడు. అనంతరం పాక్ రెండో ఇన్నింగ్స్ లో 268 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ ముల్తాన్ వేదికగా డిసెంబర్ 9న ప్రారంభం కానుంది.