క్రీడల్లో గెలుపు, ఓటములు సహజం. ఓ సారి గెలవచ్చు. మరోసారి ఓడిపోవచ్చు. ఏం జరిగినా క్రీడాస్పూర్తి అనేది ఉండాలి. ప్రత్యర్థితో జరుగుతున్న మ్యాచ్‌లో ఓడిపోయే స్థితిలో ఉన్నప్పుడు కోపం రావడం సహజం. కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకొని మ్యాచ్ ఓడినా పర్లేదు అనేలా క్రీడాస్పూర్తిని ప్రదర్శించాలి. కానీ కొంతమంది మాత్రం తమ ఓటమిని భరించలేక ప్రత్యర్థిపై దాడికి దిగడం చూస్తుంటాం. ఓడిపోతున్నాననే అసహనంతో ఓ బాక్సర్ ప్రత్యర్థి చెవిని కొరికాడు. ఈ విషయాన్ని రిఫరీ చూడకపోయినప్పటికి టీవీల్లో మాత్రం కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ప్రత్యర్థి చెవి కొరికినప్పటికి అతడు ఓడిపోవడం విశేషం. ఈ ఘటన టోక్యో ఒలింపిక్స్‌లో చోటు చేసుకుంది. బాక్సింగ్‌లో మంగళవారం హెవీ వెయిట్ విభాగంలో మొరాకొకు చెందిన బాక్సర్ యూనెస్ బల్లా, న్యూజిలాండ్‌కు చెందిన డేవిడ్ నికా తలపడ్డారు. బౌట్లో డేవిడ్ నికా తొలి నుంచి ఆధిపత్యం ప్రదర్శించగా యూనెస్ తేలిపోయాడు. దీంతో అసహనానికి గురైన యూనెస్ మూడో రౌండ్లో డేవిడ్ చెవి కొరకడానికి యత్నించాడు. యూనీస్ దంతాలు తగలగానే డేవిడ్ అతడిని దూరంగా నెట్టేశాడు.
బల్లా చేసిన పనిని రిఫరీ గుర్తించలేదు. టీవీల్లో మాత్రం కనబడింది. ఈ మ్యాచ్‌లో డేవిడ్ 5-0 తేడాతో యూనీస్‌ను ఓడించాడు. యూనెస్ అనుచిత ప్రవర్తనతో ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ అతడిని అనర్హుడిగా ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్లో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
మరోవైపు, టోక్యో ఒలింపిక్స్ లో పీవీ సింధు దూకుడు కొనసాగుతోంది. స్వర్ణ పతకమే లక్ష్యంగా టోక్యో ఒలింపిక్స్‌లో సత్తా చాటుతోంది.
Morocco’s Youness Baalla tried to bite the ear of New Zealand’s David Nyika!!! #Boxing #Tokyo2020 pic.twitter.com/N6LJIqjb6S
— Ben Damon (@ben_damon) July 27, 2021