సింధు చాంపియన్ గా నిలవడంలో ముఖ్య భూమిక.
ఆమెకు ప్రత్యేక శిక్షణ…
అతని ఈ త్యాగాలకు ఇప్పుడు ఫలితం…
2019లో ప్రపంచ చాంపియన్ షిప్ లో సింధు చాంపియన్ గా నిలవడంలో ముఖ్య భూమిక పోషించాడు. సింధు కరోనా విరామంతో కోల్పోయిన ఆటను తిరిగి అందుకుని మునపటిలా రాణించేలా ఆమెకు ప్రత్యేక శిక్షణ అందించాడు. పార్క్ తై సేంగ్. ఇప్పుడు మరొకసారి వెలుగులోకి వచ్చాడు. దక్షిణకొరియాకు చెందిన ఈ మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఇప్పుడు పీవీ సింధుకు కోచ్. ప్రస్తుత టోక్యో ఒలింపిక్స్‌లో సింధు విజయాల్లో కీలక భూమిక పోషించిన పార్క్ తై సేంగ్ ఖాతాలో ఒలింపిక్ మెడల్ లేదు. కానీ సింధు రూపంలో తన కలను నెరవేర్చుకున్నాడు పార్క్ తై సేంగ్.
2002లో ఆసియా గేమ్స్ చాంపియన్ అయిన పార్క్ తై సేంగ్ 1999లో ఆసియా కప్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం గెలవగా, 2004లో ఆసియన్ చాంపియన్‌షిప్ వ్యక్తిగత విభాగంలో కూడా కాంస్యాన్నే గెలిచాడు. 2004 సమ్మర్ ఒలింపిక్స్‌లో క్వార్టర్స్‌కు వరకూ మాత్రమే చేరగలిగాడు పార్క్ తై సేంగ్. మిక్స్‌డ్ విభాగాల్లో పతకాలు సాధించిన పార్క్ తై సేంగ్ ఒలింపిక్స్‌ను మాత్రం గెలవలేకపోయాడు. పార్క్ ఒకప్పటి దక్షిణ కొరియా బ్యాడ్మింటన్ ఆటగాడు. 2004 ఆసియా ఛాంపియన్ షిప్స్ లో కాంస్యం గెలిచాడు పార్క్. 2002 ఆసియా క్రీడల్లో పసిడి సాధించిన పురుషుల టీమ్ లో అతనూ ఓ సభ్యుడు. ఆతర్వాత కోచ్ గా మారిన అతను వ్యూహాలు రచించడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నాడు.
2013 నుంచి 2018 వరకూ కొరియా జట్టుకు కోచ్ గా పనిచేశాడు. అతని శిక్షణలో తన ఆటతీరు కచ్చితంగా మెరుగవుతుందన్న సింధు నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాడు. ఒలింపిక్స్ కు సమర్థంగా సన్నద్దమయ్యే దిశగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన గచ్చిబౌలి స్టేడియంలో పార్క్ పర్యవేక్షణలో సింధు ప్రాక్టీస్ సాగింది. ఒకేసారి ముగ్గురు లేదా నలుగురు కుర్రాళ్లను కోర్టులో మరో వైపు ఉంచి ఆమెతో ఆడించేవాడు. సింధును అయోమయంలోకి గురిచేసేలా వివిధ రకాల షాట్లు ఆడమని ఆ కుర్రాళ్లకు చెప్పి వాటిని తిప్పికొట్టేలా ఆమెకు మెళకువలు నేర్పాడు.
నెట్ దగ్గర షటిల్ ను సమర్థంగా ఆడేలా శిక్షణ ఇచ్చాడు. ఆమెకు శిక్షణ ఇవ్వడం కోసం ఇక్కడే ఉండిపోయిన అతను గతేడాది ఫిబ్రవరి నుంచి ఒక్కసారి కూడా తన కుటుంబాన్ని చూసేందుకు దక్షిణ కొరియా వెళ్లలేదు. తన నాలుగేళ్ల కూతురిని కూడా కలవలేదు. అతని ఈ త్యాగాలకు ఇప్పుడు ఫలితం దక్కింది.