మీరు టీ20 వరల్డ్ కప్ చూశారా? కచ్చితంగా చూసే ఉంటారు. ఇక ఈ టోర్నీలో పాక్ ఫైనల్ వరకు వెళ్లింది. టీమిండియా మాత్రం సెమీస్ లోనే ఓడిపోయి ఇంటిముఖం పట్టింది. ఈసారి టీమిండియా కప్ కొట్టకపోవడానికి బోలెడు కారణాలున్నాయి. వాటి గురించి ఎంత మాట్లాడుకున్నా సరే టైం సరిపోదు. కానీ టీమిండియా మేనేజ్ మెంట్ మాత్రం ఓ విషయంలో చాలా టైం వేస్ట్ చేస్తోంది. ఇప్పుడు ఆ విషయంలో నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. టీమిండియా తీరుపై విమర్శలకు కారణమవుతోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీమిండియా ప్రధాన బౌలర్ బుమ్రా సరిగ్గా టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ కావడానికి ముందు గాయపడ్డాడు. దీంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. బుమ్రా లేని లోటు.. టీమిండియా మ్యాచుల్లో స్పష్టంగా కనిపించింది. మన బౌలింగ్ బృందం కూడా చాలావరకు బాగానే ఆడింది. కానీ వరల్డ్ కప్ కొట్టాలంటే ఈ మాత్రం సరిపోదు. కట్ చేస్తే ఇదే టోర్నీలో మనతో పాటే ఆడిన పాక్ జట్టులో యువబౌలర్ నసీమ్ షాకు చోటు కల్పించారు. చాలా వేగంగా బంతులేస్తాడనే కారణంతో అతడిని జట్టులోకి తీసుకున్నారు.
కానీ అనుకున్న దానికంటే నసీమ్ షా బాగానే ఫెర్ఫార్మ్ చేశాడు. టోర్నీలో మనోడి బౌలింగ్ చూసిన చాలామంది.. భవిష్యత్తులో మంచి బౌలర్ అవుతాడని అప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు. నసీమ్ వయసు 19 ఏళ్లే. ఫిట్ నెస్ కరెక్ట్ గా మెంటైన్ చేయాలే గానీ పాక్ జట్టుకి మరో స్టార్ బౌలర్ దొరికినట్లే. బ్యాటర్లు ఎప్పుడైనా సరే దొరుకుతారు. కానీ ఇంత వేగంగా విసిరే బౌలర్లు మాత్రం దొరకరు. పాక్ ఈ విషయం నిజంగా గ్రేట్. ఎందుకంటే ఆసిఫ్, ఆమిర్ లాంటి మెరికల్లాంటి బౌలర్లని ఇలానే జట్టులో చోటు కల్పించింది. అద్భుతాలు చేసింది.
అదే టీమిండియా విషయానికొస్తే.. గత కొన్నేళ్లలో ఉమ్రాన్ మాలిక్ పేరు గట్టిగా వినిపిస్తోంది. 156 కిలోమీటర్ల ఎవరేజ్ స్పీడుతో బంతులేసే మనోడు.. ఐపీఎల్ లోనూ మోస్తరు ప్రదర్శన చేస్తున్నాడు. ప్రపంచంలోనే పేసర్ల వేగవంతమైన బంతుల సరాసరితో పోలిస్తే ఉమ్రాన్ బౌలింగ్ స్పీడ్ చాలా ఎక్కువ! ఇలాంటి బౌలర్ భారత జట్టులోకి వస్తే.. మొదట్లో సర్దుకోవడానికి కాస్త ఇబ్బంది పడినా సరే ఒక్కసారి సెట్ అయితే మాత్రం చెలరేగిపోతాడు. కానీ అలా జరగడం లేదు. రీసెంట్ గా జరిగిన టీ20 వరల్డ్ కప్ లోనూ మనోడికి చోటు దక్కలేదు. ఇప్పుడేమో జూనియర్ టీమ్ లో ఆడిస్తున్నారు. ఈ మొత్తం చూస్తన్న భారత క్రికెట్ ప్రేమికులు.. ఇప్పటికైనా టీమిండియా మేనేజ్ మెంట్ కళ్లు తెరుచుకుని.. ఉమ్రాన్ లాంటి టాలెంట్ ని గుర్తించాలని కోరుతున్నారు. ఎప్పుడూ బ్యాటర్ల గురించే కాకుండా ఫాస్ట్ బౌలర్లపైనా దృష్టి పెట్టాలని సలహా ఇస్తున్నారు.