‘ఐసీసీ టీ20 వరల్డ్‌కప్’లో ఆఫ్గనిస్థాన్‌ను తక్కువ అంచనా వేయడానికి లేదు. నేరుగా టోర్నమెంట్‌లో అర్హత సాధించిన ఎనిమిది జట్లలో ఆఫ్గన్ కూడా ఒకటి. ఆ జట్టులో టోర్నమెంట్ మొదటిలో ఒకింత అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. జట్టు కెప్టెన్ బాధ్యతల నుంచి రషీద్ ఖాన్ తప్పుకోవడం.. ఆ స్థానాన్ని మహ్మద్ నబీ స్వీకరించడం జరిగింది. ఆ తర్వాత ఆ జట్టుపై క్రికెట్ అభిమానులకు కొంత అనుమానం ఉన్న మాట వాస్తవమే. ఈసారి వీళ్ల ప్రదర్శన ఎలా ఉండబోతోందో అని. కానీ, వారి అంచనాలను తారుమారు చేస్తూ ఆఫ్గన్ జట్టు బాగా రాణిస్తోంది. స్కాట్లాండ్‌ను 130 పరుగుల తేడాతో ఓడించడమే అందుకు ఉదాహరణ. ఇప్పుడు ఆ జట్టు కెప్టెన్ వార్తల్లో నిలిచాడు. ప్రదర్శన పరంగా కాదు.. అతని ఇంగ్లీష్ ప్రావీణ్యం పరంగా.
అసలు విషయం ఏంటంటే.. ప్రతి మ్యాచ్ తర్వాత రెండు జట్ల కెప్టెన్లు మీడియా సమావేశంలో పాల్గొంటారు. అంతర్జాతీయ మీడియా కాబట్టి ప్రశ్నలు ఇంగ్లీష్‌లోనే అడుగుతారు. నబీకి అంతగా ఇంగ్లీష్ రాదు. ఉర్దూలో బాగానే మాట్లాడగలడు కానీ ఇంగ్లీష్‌లో ఆపకుండా మాట్లాడలేడు. స్కాట్లాండ్ మ్యాచ్ తర్వాత జరిగిన ఒక ఫన్నీ ఘటన ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీడియా సమావేశంలో కూర్చొని వెయిట్ చేస్తున్న నబీ మాట్లాడిన మాటలు నవ్వులు పూయిస్తున్నాయి. విలేఖరుల ప్రశ్నల కోసం ఎదురుచూస్తుండగా.. ‘ఇది అన్నింటి కంటే ఎంతో కష్టమైన పని. చెప్పండి ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇలాగైతే నా ఇంగ్లీష్ ఐదు నిమిషాల్లోనే అయిపోతుంది’ అంటూ నబీ మాట్లాడిన వీడియో ఒకటి బాగా వైరల్ అవుతోంది. అంతే కాదు ఆ సమయంలో మహ్మద్ నబీ ఎక్స్‌ప్రెషన్స్ కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
“5 mint main meri English Khatam hojye gi”😂#T20WorldCup2021 pic.twitter.com/ugbmHFLeL4
— Abdul Wahab (@abdulwahabdr02) October 26, 2021