భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా విజయం కోసం ఎదురీదుతోంది. ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే టీమిండియా బౌలర్లు మొహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, ఉమ్రాన్ మాలిక్ మ్యాచ్ ఆరంభంలో నిప్పులు చెరగడంతో బంగ్లాదేశ్ కనీసం వంద పరుగులు కూడా చేయగలదా? అనే అనుమానం కలిగింది. 69 పరుగులుకే 6 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ.. తొలి వన్డే హీరో మెహిదీ హసన్ మిరాజ్ మరో సారి అమూల్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. మిడిల్డార్ బ్యాటర్ మహ్మదుల్లాతో కలిసి.. ఏడో వికెట్‌కు రికార్డు బ్రేకింగ్ పార్ట్నర్‌షిప్‌ను నెలకొల్పాడు. ఏకంగా 148 పరుగుల జోడించి.. బంగ్లాదేశ్‌ను పటిష్ట స్థితికి చేర్చాడు.
77 పరుగులు చేసిన మహ్మదుల్లా ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో కీపర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన క్యాచ్‌తో అవుట్ అవ్వడంతో.. భారీ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత కూడా మెహిదీ తన జోరు కొనసాగించాడు. ఆరంభంలో బంగ్లా బ్యాటింగ్ లైనప్‌ను వణికించిన బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. మెహిదీ సంచలన బ్యాటింగ్‌తో చివరి 10 ఓవర్లలో బంగ్లా భారీ స్కోర్‌చేసింది. కేవలం 83 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులతో 100 పరుగులు చేసి సెంచరీ పూర్తి చేసుకున్న మెహిదీ.. టీమిండియా ముందు ఊహించని విధంగా ఏకంగా 272 పరుగుల టార్గెట్‌ను ఉంచాడు. ఎక్కడో 69 పరుగులకు 6 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్.. 50 ఓవర్లు పూర్తిగా ఆడి 7 వికెట్లు కోల్పోయి 271 పరుగుల భారీ స్కోర్ చేసింది. 272 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా బ్యాటింగ్‌కు రాకపోవడంతో ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ.. శిఖర్ ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు.
కానీ.. కేవలం 5 పరుగులు చేసి ఇబాదత్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ ధావన్ సైతం 8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ 11, కేఎల్ రాహుల్ 14 పరుగులు చేసి వెంటవెంటనే అవుట్ అవ్వడంతో.. టీమిండియా 65 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యార్.. అక్షర్ పటేల్‌తో కలిసి టీమిండియా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్, ఈ మ్యాచ్‌లో సెంచరీ హీరో మెహిదీ ఇన్నింగ్స్ 21వ ఓవర్ వేసేందుకు వచ్చాడు. తొలి మూడు బంతుల్లో 6 పరుగులు ఇచ్చిన మెహిదీ.. నాలుగో బాల్ వేసే క్రమంలో.. బౌలర్ ఎండ్‌లో ఉన్న వికెట్లను కాలితో గిరాటేశాడు.. దీంతో అంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు. అలాగే ఐదో బంతి వేసే క్రమంలో కూడా అలాగే వికెట్లకు కాలు తగలడంతో అంపైర్ మళ్లీ నో బాల్ ఇచ్చాడు. ఇలా ఒకే ఓవర్‌లో వికెట్లకు కాలు తగలడంతో రెండు సార్లు నో బాల్ రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.
2 back-to-back no balls by Mehidy Hasan 🤔
📸: SonyLiv#crickettwitter #indvsban pic.twitter.com/VHIU70OmrX
— Sportskeeda (@Sportskeeda) December 7, 2022