అంతర్జాతీయ క్రికెట్లో రికార్డులు బద్దలు కొట్టడమే పనిగా ముందుకు సాగుతున్న విరాట్ కోహ్లీని మరో అరుదైన రికార్డు ఊరిస్తోంది! అయితే ఇది సాధ్యపడాలంటే ప్రత్యర్థి జట్టులో ఆ అటగాడు ఉండటం తప్పనిసరి.
ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) ఫైనల్లో నిరాశ పరిచి రన్నరప్‌తో సరిపెట్టుకున్న భారత్.. మరో రెండు రోజుల్లో 2023-25 డబ్లూ్యటీసీ సర్కిల్‌ను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా వెస్టిండీస్‌తో టీమ్ఇండియా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. బుధవారం నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుండగా.. మ్యాచ్ ఆరంభానికి ముందే రన్‌మెషీన్ విరాట్ కోహ్లీని మరో అరుదైన రికార్డు ఊరిస్తున్నది. అంతర్జాతీయ క్రికెట్లో లెక్కకు మిక్కిలి రికార్డులు తన పేరిట లిఖించుకున్న కోహ్లీ.. ఈ ఘనత దక్కించుకోవడం వెనుక ఒక చిన్న సమస్య ఉంది. అదేంటి పిచ్‌తో, ప్రత్యర్థితో సంబంధం లేకుండా పరుగుల వరద పారించగల కోహ్లీకి సమస్యేంటి అని అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నా! కోహ్లీ ఈ రికార్డు సాధించాలంటే.. వెస్టిండీస్ జట్టులో ఓ యువ ఆటగాడికి అవకాశం దక్కాల్సిన అవసరం ఉంది.
శతాబ్దాల క్రితమే బారత్ నుంచి వలస వెళ్లిన కుటుంబంలో జన్మించి.. ఆ తర్వాత వెస్టిండీస్ జాతీయ జట్టు తరఫున వేలాది పరుగులు చేసిన శివ్‌నరైన్ చంద్రపాల్ గుర్తున్నాడా? ప్రస్తుతం అతడి కుమారుడు టగ్‌నరైన్ చంద్రపాల్ సుదీర్ఘ ఫార్మాట్లో కరీబియన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తాజాగా టీమ్ఇండియాతో జరుగనున్న తొలి టెస్టు కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు 13 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. అందులో టగ్‌నరైన్ చంద్రపాల్‌కు చోటు దక్కింది. డొమినికా వేదికగా జరుగనున్న ఈ పోరులో చంద్రపాల్ తుది జట్టులో ఉంటే.. విరాట్ ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరనుంది. గతంలో (2011) భారత జట్టు విండీస్‌లో పర్యటించిన సందర్భంగా శివ్‌నరైన్ చంద్రపాల్ ప్రత్యర్థికి విరాట్ కోహ్లీ మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు అతడి కుమారుడు టగ్‌నరైన్ చంద్రపాల్‌కు కూడా ప్రత్యర్థిగా బరిలోకి దిగితే ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా కోహ్లీ నిలువనున్నాడు. గతంలో పలువురు క్రికెటర్లు ఇలా తండ్రీ కొడుకులు ప్రత్యర్థులుగా తలపడ్డా విదేశీ గడ్డపై మాత్రం ఇలా చరిత్రలో ఒక్కసారే జరిగింది.
రెండు దశాబ్దాలకు పైగా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి రికార్డు స్థాయిలో ఆరు వన్డే ప్రపంచకప్‌లు ఆడిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గతంలో ఈ ఘనత దక్కించుకున్నాడు. కెరీర్ తొలినాళ్లలో సచిన్ 1992 ఆసీస్ పర్యటనలో జెఫ్ మార్ష్ ప్రత్యర్థిగా ఆడాడు. ఆ తర్వాత దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత (2011-12) జెఫ్ మార్ష్ కుమారుడు షాన్ మార్ష్ తోనూ మాస్టర్ తలపడ్డాడు.