హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని టీమిండియా ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. కానీ.. మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్ మాత్రం భారత అభిమానులను హైటెన్షన్‌కు గురి చేసింది. పసికూన ఐర్లాండ్ చేతిలో ఇండియా ఎక్కడ ఓడిపోతుందో అనే భయంతో చాలా మంది నిన్న మ్యాచ్‌ను ఊపిరిబిగబట్టి చూశారు. టీమిండియా తొలుత బ్యాటింగ్‌లో చేసి ఐర్లాండ్ బౌలర్లను చితక్కొట్టినా.. ఐరిష్ బ్యాటర్లు కూడా అంతే ధీటుగా జవాబు ఇవ్వడంతో 225 పరుగుల భారీ స్కోర్ చేసిన తర్వాత కూడా విజయం కోసం చెమటలు కక్కాల్సివచ్చింది.
ఐర్లాండ్ బ్యాటింగ్ చేసిన తీరు చూస్తుంటే.. టీమిండియాతో ఆడుతుంది ఐర్లాండా? లేక ఆస్ట్రేలియానా? అనే అనుమానం కలిగింది అభిమానులకు. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో భారత్ 4 పరుగుల తేడాతో చావుతప్పి కన్నులొట్టబోయి గెలుపొందింది. ఓటమి ఖాయమనుకున్న పరిస్థితుల్లో కశ్మీర్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో భారత్ విజయాన్నందుకుంది. చిన్న బౌండరీలు కలిగిన మైదానం కావడంతో ఇరు జట్ల బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. దాంతో అభిమానులు సిక్సర్లు, ఫోర్ల వర్షంతో తడిసి ముద్దయ్యారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 225 పరుగులు చేసింది. దీపక్ హుడా(57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 104) సెంచరీతో కదంతొక్కగా.. సంజూ శాంసన్(42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరి (రెండో వికెట్‌కు 176 పరుగుల) రికార్డు భాగస్వామ్యాన్ని అందించారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్ మూడు వికెట్లు తీయగా.. జోష్ లిటిల్, క్రైగ్ యంగ్ రెండు వికెట్లు పడగొట్టారు. వణికించిన బాల్‌బిర్నీ అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 221 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఆ జట్టులో ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్(18 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 40), ఆండీ బాల్‌బిర్నీ(37 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 60)టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఈ ఇద్దరికి తోడు హరీ టెక్టర్(28 బంతుల్లో 5 ఫోర్లతో 39), జార్జ్ డాక్‌రెల్(16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 నాటౌట్) రాణించారు. భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, ఉమ్రాన్ మాలిక్ తలో వికెట్ తీసారు.
భారీ లక్ష్యఛేదనకు దిగిన ఐర్లాండ్ బ్యాటర్లు సైతం ధీటుగా బదులివ్వడంతో 226 పరుగులు లక్ష్యంగా చిన్నబోయింది. లక్ష్యాన్ని చేధించాలనే ఆతృతలో వికెట్లు పారేసుకొని సునాయసంగా గెలిచే మ్యాచ్‌ను చేజార్చుకున్నారు. చివరి ఓవర్‌లో ఐర్లాండ్ విజయానికి 17 పరుగులు అవసరమయ్యాయి. అయితే అప్పటి వరకు ఐర్లాండ్ బ్యాటింగ్ చేస్తున్న తీరు చూస్తే.. ఈ రన్స్ పెద్ద కష్టంగా అనిపించలేదు. దానికి తోడు ఉమ్రాన్ మాలిక్ రెండో బంతి నోబాల్‌గా వేయడంతో ఎక్స్‌ట్రా డెలివరీతో పాటు ఫ్రీహిట్ లభించింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఐరీష్ బ్యాటర్లు వరుసగా రెండు బౌండరీలు బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేసేలా కనిపించారు. కానీ తర్వాతి మూడు బంతులను ఉమ్రాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా బౌలింగ్ చేయడంతో పాటు బౌండరీలు బాదకుండా కచ్చితమైన యార్కర్లు సంధించాడు. దాంతో చివరి మూడు బంతుల్లో మూడు పరుగులు మాత్రమే వచ్చి భారత్‌కు విజయాన్ని అందించాడు. ఇలా పసికూనపై విజయం సాధించేందుకు టీమిండియా బౌలర్లు ఆపసోపాలు పడ్డారు. మరి ఈ మ్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🙏 FAREWELL AND THANKS
Thanks to the @BCCI for visiting and for being part of a great series. Farewell for now, we hope to see you on the field again soon.
☘️🏏🇮🇳 pic.twitter.com/IVevdE7cUm
— Cricket Ireland (@cricketireland) June 28, 2022
𝗪. 𝗜. 𝗡. 𝗡. 𝗘. 𝗥. 𝗦 🏆
That’s a wrap from Ireland! 👍#TeamIndia win the two-match #IREvIND T20I series 2️⃣-0️⃣. 👏 👏 pic.twitter.com/7kdjMHkrFR
— BCCI (@BCCI) June 28, 2022