శ్రీలంకతో రాజ్ కోట్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. దాంతో మూడు మ్యాచ్ ల సిరీస్ ను 2-1తో భారత్ కైవసం చేసుకుంది. శనివారం జరిగిన చివరి మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు లంక బౌలర్లకు చుక్కలు చూపించారు. సిక్స్ లు, ఫోర్లతో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డారు. మరీ ముఖ్యంగా సూర్య కుమార్ ఆట గురించి ఇక్కడ చెప్పుకోవాలి. సునామీ ఇన్నింగ్స్ ఆడిన సూర్య కేవలం 45 బంతుల్లోనే శతకంతో కదం తొక్కాడు. 51 బంతుల్లో 9 సిక్స్ లు, 7 ఫోర్లలతో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దాంతో ప్రపంచ వ్యాప్తంగా సూర్యపై ప్రశంసల వర్షం కురుస్తోంది. టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా సూర్య పై పొగడ్తలు కురిపిస్తూనే.. నేను సూర్యకు బౌలింగ్ చేస్తే ఎలా ఉంటుందో కూడా చెప్పాడు. ప్రస్తుతం పాండ్యా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
శ్రీలంకతో తాజాగా జరిగిన మ్యాచ్ లో సూర్యకుమార్ బ్యాటింగ్ చూస్తుంటే.. ఇలాంటి బ్యాటింగ్ ని, బ్యాటర్ ను చరిత్రలో చూడలేదు అనిపిస్తుంది. అసలు మనం చూస్తుంది లైవ్ మ్యాచ్ హా.. హైలెట్స్ హా.. అన్నంతగా సూర్య బ్యాటింగ్ ఉంది. ఇక మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడాడు. సూర్యను ప్రశంసలతో ముంచెత్తాడు. సూర్యకు పాండ్యా బౌలింగ్ చేయాల్సి వస్తే అన్న ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. పాండ్యా మాట్లాడుతూ..”సూర్యకుమార్ ఆటతీరు ప్రతీ మ్యాచ్ లో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అతడి షాట్స్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక ఇలాంటి ఇన్నింగ్స్ లు ఆడిన ప్రతీసారి అతడు చెప్పే మాట ఒక్కటే.. బ్యాటింగ్ చేయడం చాలా ఈజీగా ఉందని. ఒక వేళ నేనే గనక సూర్యకు బౌలింగ్ చేస్తే.. హడలెత్తిపోయే వాడ్ని, చాలా బాధపడేవాడిని” అని చెప్పుకొచ్చాడు పాండ్యా.
ఇక ఈ మ్యాచ్ లో ఎప్పటి లాగే తన మార్క్ షాట్స్ తో సూర్య అలరించాడని పాండ్యా కితాబిచ్చాడు. అయితే అతడికి బ్యాటింగ్ లో ఎవరి సలహాలు అవసరం లేదు. ఎందుకంటే ఏ టైమ్ లో ఎలా ఆడాలో సూర్యకు బాగా తెలుసు అన్నాడు పాండ్యా. ఇక ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ పై కూడా ఈ సందర్బంగా పొగడ్తల వర్షం కురిపించాడు. అతడు బౌలింగ్ లో, బ్యాటింగ్ లో నన్ను గర్వపడేలా చేశాడని పాండ్యా అన్నాడు. అక్షర్ పటేల్ కు ఆత్మవిశ్వాసం అందిస్తే చాలు.. అతడు ఆటలో రెచ్చిపోతాడని కితాబిచ్చాడు పాండ్యా. ఇక ఈ గేమ్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రాహుల్ త్రిపాఠి బ్యాటింగ్. అతడు చాలా నేచురల్ గా ఆడాడు అంటూ పాండ్యా పొగిడాడు. ఇలాంటి ఆటగాళ్లు జట్టుకు ఎంతో ప్రయోజనకరం అని పేర్కొన్నాడు. వీరద్దరు అత్యుత్తమ టీ20 ప్లేయర్లే కాబట్టి ఇక్కడ ఉన్నారు. సారథిగా ఆటగాళ్లకు మద్దతుగా నిలవడమే నా లక్ష్యం అంటూ చెప్పుకొచ్చాడు హార్దిక్ పాండ్యా.