ఇంజమామ్ వుల్ హక్.. క్రికెట్ ప్రపంచంలో ఈ పేరుకు ప్రత్యేక స్థానం ఉంది. ఒక్క పాకిస్తాన్ నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఇంజమామ్‌ను అభిమానించేవారు. జట్టులోకి అడుగుపెట్టిన సంవత్సరానికే వరల్డ్ కప్ పోరులో అద్భుతాలు సృష్టించాడు. వన్డేల్లో పాక్ తరఫున 11,739 పరుగులు చేశాడు. ఒక ఆటగాడిగానే కాకుండా.. కెప్టెన్‌గా జట్టుకు ఎన్నో అద్భుత విజయాలను అందించాడు. ఇంజమామ్ క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్లకు దడ పుట్టేది. స్టెపౌట్ అయ్యాడు అంటే బాల్ బౌండరీకి చేరాల్సిందే. చూడటానికి ఎంతో బబ్లీగా ఉండే ఇంజిమామ్ ఉల్ హక్ అలవోకగా సిక్సులు బాదేవాడు. కాకపోతే ఇంజమామ్ ఆటలో ఒకటే చిన్న లోపం ఉండేది.. రన్నింగ్ చేసేందుకు ఇష్టపడేవాడు కాదు. కానీ, బ్యాట్ పట్టుకుంటే పరుగుల వరద పారించేవాడు.
ఇంజమామ్ ఉల్ హక్ పాకిస్తాన్ జట్టు తరఫున 22 నవంబర్ 1991న తొలి వన్డే ఆడాడు. అతనికున్న గొప్ప టాలెండ్‌తో ఫిబ్రవరి 22, 1992లో జరిగిన వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఆమెర్ సోహైల్, రమీజ్ రజా, ఇమ్రాన్ ఖాన్, జావెద్ మిందాద్, వసీం అక్రమ్ వంటి హేమాహేమీలు ఉన్న తరుణంలో కూడా వరల్డ్ కప్పులో ఇంజమామ్ స్థానం దక్కించుకున్నాడు అంటే అతని టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జట్టులో ఇంజమామ్‌కి ఇమ్రాన్ ఖాన్ మిడిల్ ఆర్డర్‌లో అతనికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. ఎంత మంది స్టార్లు ఉన్నా కూడా ఇంజిమామ్ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకోగలిగాడు. 1992 వరల్డ్ కప్ తొలి మ్యాచుల్లో ఇంజమామ్ ఉల్ హక్ పెద్దగా రాణించలేదు.
కానీ, ఇంజమామ్‌ని ఇమ్రాన్ ఖాన్ పక్కన పెట్టలేదు. అతడు రాణిస్తాడనే నమ్మకం ఉంటబట్టే మళ్లీ అవకాశం కల్పించారు. ఆ అవకాశాన్ని ఇంజమామ్ ఉపయోగించుకున్నాడు. సెమీస్(37 బంతుల్లో 60), ఫైనల్ మ్యాచ్(35 బంతుల్లో 42)లో మాత్రం తన మార్క్ చూపించాడు. ఆ తర్వాత పాకిస్తాన్ జట్టులో ఇంజమామ్ ఉల్ హక్‌ని ఎవరూ ఆపలేకపోయారు. ఎలాంటి ప్రత్యర్థి అయినా కూడా విజృంభించేవాడు. ఇమ్రాన్ ఖాన్ లాంటి వాళ్లు అతడిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్‌గా అయ్యాడు. పాక్ జట్టుకు కెప్టెన్‌గా ఎన్నో విజయాలను అందించాడు. జట్టు కూడా పటిష్టంగా రాణించేందుకు తగిన నిర్ణయాలు కూడా తీసుకున్నాడు. క్రికెట్ చరిత్రలో ఇంజమామ్ ఉల్ హక్ ఒక అజాత శత్రువు అని చెప్పచ్చు.
అయితే ఈ మాటలు ఊరికే చెప్పేవి కావ. క్రికెట్ పరంగా ఏ జట్టు అయినా ఇంజమామ్‌ని గౌరవించేవాళ్లు. అటు ఇంజమామ్ కూడా అందరినీ అభిమానించేవాడు. దాయాదుల పోరు అంటే వాతావరణం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. పాక్- టీమిండియా మ్యాచ్ అంటే అదేదో యుద్ధంలా భావించేవారు. మైదానంలో ప్లేయర్లు కూడా ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకోవడం, స్లెడ్జింగ్ చేయడం చేసే వాళ్లు. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్, రమీజ్ రజా, వసీం అక్రమ్, షోయబ్ అక్తర్, షాహీద్ అఫ్రిదీ లాంటివాళ్లు అవసరం లేకున్నా కూడా టీమిండియా అంటే అక్కసు వెళ్లగక్కుతూ ఉంటారు. ఇప్పటికీ వారి ధోరణి మారలేదు. తగుదునమ్మా అంటూ వచ్చి భారత్‌పై బురద జల్లే ప్రయత్నం చేస్తుంటారు.
అయితే ఇంజమామ్ ఉల్ హక్ అలా ఉండేవాడు కాదు. అతను కెప్టెన్‌గా ఉన్నప్పుడు టీమ్‌లో అలాంటి పరిస్థితులు ఉండేవి కావు. టీమిండియా- పాకిస్తాన్ పర్యటించినప్పుడు కూడా వారిని ఎంతో గౌరవంగా చూసుకున్నారు. అందుకు సంబంధించిన క్రెడిట్ ఇంజమామ్ ఉల్ హక్‌కే దక్కుతుంది అంటారు. అలాగే ఇంజమామ్ ఇప్పటికీ టీమిండియా జట్టుని గానీ, ప్లేయర్‌ని గానీ పల్లెత్తు మాట అనలేదు. అందుకే ఇప్పటికీ టీమిండియా అభిమానులు సైతం ఇంజమామ్ ఉల్ హక్ గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడరు, ట్రోల్ చేయరు. ఒక్క భారత్ జట్టు అభిమానాన్నే కాదు.. ఇంజమామ్ భారత క్రికెట్ అభిమానుల హృదయాలను సైతం కొల్లగొట్టాడు. అందుకే ఇప్పటికీ ఇంజమామ్ ఉల్ హక్ అంటే టీమిండియా, అభిమానులకు అంత అభిమానం.