90వ దశకం.. క్రికెట్ ప్రపంచాన్ని ఆస్ట్రేలియా, పాకిస్థాన్, వెస్టిండీస్, ఇంగ్లాండ్ లాంటి జట్లు ఏలుతున్న కాలం. అప్పటికి శ్రీలంక పసికూన కింద లెక్కే. ర్యాంకింగ్స్ లో అట్టడుగు స్థాయిల్లో ఉంటూ.. కాలం ఈడుస్తున్న టైమ్ అది. అప్పుడే జట్టులోకి వచ్చాడు 18 ఏళ్ల కుర్రాడు. చూడ్డానికి బొద్దుగా, గుండ్రాయిలాగా నున్నగా ఉన్నాడు. అయితే అందరిలాగానే జట్టులోకి వస్తాడు.. అందరిలాగే వెళ్లిపోతాడు అనుకున్నారు క్రికెట్ నిపుణులు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. శ్రీలంక టీమ్ కు 1996లో ఏకంగా ప్రపంచ కప్ ను అందించిన ఘనత అతడి సొంతం. అలా శ్రీలంక క్రికెట్ చరిత్ర గతినే మార్చిన ఆ ఒకే ఒక్కడి పేరు అర్జున్ రణతుంగ.. అవసాన దశలో ఉన్న శ్రీలంక జట్టును సాన పట్టి, ప్రపంచంలోనే అత్యున్నత జట్టుగా తీర్చిదిద్దడంలో రణతుంగ పాత్ర అమోఘమైనది. టీమిండియాలో గంగూలీ, ధోనిలు తీసుకొచ్చిన సంస్కరణలను అర్జున్ రణతుంగ 90ల్లోనే తీసుకొచ్చాడు. ఈ క్రమంలోనే ఇన్సూరెన్స్ ఏజెంట్ నుంచి వరల్డ్ కప్ హీరోగా ఎదిగిన రణతుంగ ప్రస్థానం గురించి ఓసారి పరిశీలిద్దాం.
అర్జున్ రణతుంగ.. 18 ఏళ్ల ప్రాయంలో అరవీర భయంకరమైన ఇంగ్లాండ్ బౌలింగ్ ను ఎదుర్కొంటూ.. తన తొలి టెస్టు మ్యాచ్ లోనే అర్దశతకం సాధించి ఈ ఘనత సాధించిన శ్రీలంక తరపున తొలి క్రికెటర్ గా నిలిచాడు. అవకాశం దొరికినప్పుడల్లా తన సత్తాను నిరూపించుకుంటూ.. జట్టులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. అది 1986 పాకిస్థాన్ తో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. అప్పటికి శ్రీలంక 83/3 తో పీకల్లోతు కష్టాల్లో ఉంది. అందరు ఓటమి ఖాయం అనుకున్నారు. అప్పుడే క్రీజ్ లోకి వచ్చాడు రణతుంగ. ఇమ్రాన్ ఖాన్, అబ్దుల్ ఖాదిర్, వసీం అక్రమ్ లాంటి భయంకర బౌలర్లను ఎదుర్కొంటూ.. 4వ వికెట్ కు అసంక గురుసిన్హతో కలిసి అభేద్యమైన 240 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ లో తన కెరీర్లో అత్యధిక స్కోర్ 135 పరుగులు నమోదు చేసి.. మ్యాచ్ ను డ్రాగా ముగించాడు. దాంతో ఒక్కసారిగా ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. 1986 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో పాక్ పై 57 రన్స్ చేసి శ్రీలంక కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
1988 వరకు జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న రణతుంగ.. 1988లో కెప్టెన్ గా పగ్గాలు చేపట్టాడు. అతడు జట్టు పగ్గాలు చేపట్టే నాటికీ శ్రీలంక అనామక జట్టుగానే ప్రపంచ క్రికెట్లో కొనసాగుతోంది. ఎప్పుడైతే రణతుంగ సారథిగా పగ్గాలు అందుకున్నాడో టీమ్ లో సమూల మార్పులు తీసుకొచ్చాడు. యంగ్ ప్లేయర్స్ తో పాటు అరవింద్ డి సిల్వ లాంటి సీనియర్ ప్లేయర్స్ ను కూడా కలుపుకుని పోయాడు. ముఖ్యంగా అతడి స్టాటజీని అంచనా వేయడంలో ప్రత్యర్థి జట్లు విఫలం అయ్యేవి. వీలైనంత త్వరగా తొలి 15 ఓవర్లలో భారీగా పరుగులు చేయాలని, ఇదే తన విజయ రహస్యంగా చెప్తాడు రణతుంగ. అతడి మెదడులోని ఆలోచనలను పసిగట్టడం ఎవరితరం కాకపోయేది. దాంతో అతడి ట్రిక్స్ ను, అతడు ఫాల్లో అయిన విధానాలను ఇతర దేశాల ఆటగాళ్లు కాపీ కొట్టేవారు. అతడు కెప్టెన్ గా విజయవంతం అయ్యాడు అనడానికి 1996 వరల్డ్ కప్, 1997 ఆసియా కప్ లను శ్రీలంక గెలుచుకోవడమే. 96 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో సిల్వతో కలిసి రణతుంగ నెలకొల్పిన అభేద్యమైన భగస్వామ్యంతో లంక కప్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో రణతుంగ 47 విలువైన రన్స్ చేశాడు.
అయితే రణతుంగ కెప్టెన్ గా ఎలాంటి వ్యూహాలు అవలంభిస్తాడో.. మైదానంలో అంతే అగ్రెసీవ్ గా ఉంటాడు. దానికి ఉదాహరణ ముత్తయ్య మురళి ధరన్ బౌలింగ్ పై వచ్చిన ఆరోపణల ఘటనే. ఆస్ట్రేలియాతో 1998లో శ్రీలంక ట్రై సిరీస్ ఆడింది. ఆ సిరీస్ లో ఆస్ట్రేలియా టీమ్ మురళి ధరన్ త్రో బౌలింగ్ వేస్తున్నాడు అని అరోపించింది. అప్పట్లో ఈ సంఘటన క్రీడాప్రపంచంలో ఓ సంచలనం. ఈ విషయంపై రంగంలోకి దిగిన రణతుంగ మురళి ధరన్ కు అండగా నిలిచాడు. అదీ కాక ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో ఆస్ట్రేలియా అంపైర్ రాస్ ఎమిర్సన్ ధరన్ బౌలింగ్ ను త్రో అంటూ అతడిని బౌలింగ్ వేయకుండా నిలిపివేశాడు. దాంతో పెవిలియన్ దగ్గర నుంచి మైదానంలోకి దూసుకొచ్చిన రణతుంగ అంపైర్ తో వాగ్వాదానికి దిగాడు. రణతుంగ పోరాటం ఫలితంగా ఐసీసీ మురళి ధరన్ కు క్లీన్ చిట్ ఇచ్చింది.
రణతుంగ అటు ఆటగాడిగానే కాక.. ఇటు సారథిగా జట్టుకు వెన్నముకగా ఉండి అనేక అద్భుతమైన విజయాలను లంక ఖాతాలో వేశాడు. మైదానంలో ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో రణతుంగ దిట్ట అని దిగ్గజ క్రికెటర్లు ఎందరో ప్రశసించారు. ఇప్పుడైతే అందరు ధోని.. ధోని అంటున్నారు గానీ, ధోని వ్యూహాలన్నీ 90ల్లోనే రణతుంగ వాడిపడేశాడు. అందుకే కొంత మంది రణతుంగ 10 మంది ధోనిలతో సమానం అని అంటుంటారు. అయితే తన రిటైర్మెంట్ తర్వాత శ్రీలంక క్రికెట్ బోర్డులో అనేక హోదాల్లో పదవులు నిర్వహించాడు. అనంతరం రాజయకీయ రంగ ప్రవేశం చేసి ప్రజాసేవకుడిగా మంచి పేరుతెచ్చుకున్నాడు. తన వ్యూహ, ప్రతివ్యూహాలతో పసికూనలాగ ఉన్న శ్రీలంక ను క్రికెట్ ప్రపంచంలో సింహంలా చేసింది మాత్రం అర్జున్ రణతుంగానే.