మరో ఏడాది కాలగర్భంలో కలిసిపోతోంది. కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం.. ఈ క్రమంలో ఈ ఏడాదిలో జరిగిన సంఘటనల గురుంచి ఓ రౌండప్ వేద్దాం.. ఈ ఏడాది కొందరికి మధుర జ్ఞాపకంగా మిగిలిపోతే.. మరికొందరికి మాత్రం తీరని వేదన మిగిల్చింది.. ఇంకొందరు మిశ్రమ ఫలితాలతో సరిపెట్టుకున్నారు. ఇక, క్రికెట్‌ను ఒక మతంగా అభిమానించే ఇండియాలో.. అదంటే పడి చచ్చే అభిమానులకు ఈ ఏడాది తీవ్ర నిరాశను మిగిల్చింది. టీమిండియాకు ఈ ఏడాది ఏరకంగానూ కలిసిరాలేదు. వరుస ఓటములు జట్టును వేధించాయి. కెప్టెన్లు మారినా తలరాత మాత్రం మారలేదు.
టీమిండియా ఎదుర్కొన్న కొన్ని ఓటములు అభిమానుల హృదయాలను కలవరపెట్టాయి. అందులో టీ20 ప్రపంచకప్ ఓటమి ఒకటి. అంతకంటే ముందు ఆసియా కప్‌లో పాకిస్థాన్, శ్రీలంక చేతుల్లో పరాజయం పాలైంది. ఇవేకాదు, మరెన్నో పరాభవాలు జట్టును వెంటాడాయి. ఏ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి భారత జట్టు 71 (7 టెస్టులు, 24 వన్డేలు, 40 టీ20లు) మ్యాచులు ఆడగా.. సాధించిన విజయాల సంఖ్య 46. టెస్టుల్లో 4, వన్డేల్లో 14, టీ20ల్లో 28.. ఇవి మూడు ఫార్మాట్లలో టీమిండియా గెలిచిన మ్యాచుల సంఖ్య. ఈ జయపజయాలను పక్కనపెడితే.. కొందరు భారత బ్యాటర్లు చెలరేగిపోయి, తమ ప్రదర్శనతో క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నారు. ఆ ఆటగాళ్లెవరో ఇప్పుడు చూద్దాం..
సూర్యకుమార్ యాదవ్(SKY)
సూర్యకుమార్ యాదవ్ అలియాస్ ‘స్కై‘.. ఈ ఏడాది ఏ భారత అభిమాని నోట విన్నా అతడి పేరే.. ఎక్కడైనా అతడి గురించి చర్చే. ప్రస్తుత భారత జట్టులో అందరి కంటే ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ఆడుతున్న ఆటగాడు సూర్య అనడంలో అతిశయోక్తి లేదు. అతని కంటే మెరుగైన బ్యాటర్ కూడా లేడు! 360 డిగ్రీల బ్యాటింగ్‌తో అసలు సిసలు టీ20 ఆటకు పర్యాయపదంగా మారిపోయాడు సూర్య. అతడి ఒక్కో ఇన్నింగ్స్ ఒక్కో ఆణిముత్యం. సూర్య ఆట గురుంచి ఒక్క మాటలో చెప్పాలంటే.. బౌలర్ ఎవరన్నది మనకు అనవసరం.. కొట్టిందల్లా సిక్సర్.. బాదిందల్లా బౌండరీ!
2021లో అరంగ్రేటం చేసిన సూర్య ఇప్పటి వరకు 42 టీ20ల్లో 2 సెంచరీలు, 12 అర్ధ శతకాలతో 1408 పరుగులు రాబట్టాడు. సగటు 44.00 కాగా.. స్ట్రైక్‌రేటు 180 పైచిలుకే. ఇక ఈ ఏడాది విషయానికొస్తే.. సూర్య ఈ ఏడాది 31 టీ20ల్లో 46.56 సగటుతో 1,164 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 9 అర్థ సెంచరీలు ఉన్నాయి. అలాగే.. 13 వన్డేలు ఆడిన సూర్య 260 పరుగులు చేశాడు. ఓకే ఒక అర్థ సెంచరీ ఉంది. మొత్తంగా సూర్య ఈ ఏడాది 43 ఇన్నింగ్స్ ఆడాడు. వీటిల్లో 2 సెంచరీలు, 10 అర్థ సెంచరీలతో 40.68 పరుగుల సగటుతో 1,424 పరుగులు చేశాడు.
శ్రేయాస్ అయ్యర్
టీ20లకు సూర్య ఎలాగో.. వన్డేలకు శ్రేయాస్ అయ్యర్ అలాగే. కానీ, చాలా మందికి అయ్యర్ ఆటతీరు నచ్చదు. స్థిరంగా రాణించకపోవడమే అందుకు కారణం. కానీ, నిలకడకు మరో పేరు.. అయ్యర్. భారత్ తరుపున ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు అయ్యరే. మొత్తంగా ఈ ఏడాది 40 మ్యాచులు ఆడిన అయ్యర్, 48.75 సగటుతో 1,609 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 14 అర్థ సెంచరీలు ఉన్నాయి.
ఈ ఏడాది 5 టెస్టులాడిన అయ్యర్.. 60.28 సగటుతో 422 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్థ సెంచరీలు ఉన్నాయి. అలాగే.. 17 వన్డేలలో 55.69 సగటుతో 724 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 6 అర్థ సెంచరీలు ఉన్నాయి. ఇక టీ20ల్లో 35.61 సగటుతో 463 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్థ సెంచరీలు ఉన్నాయి. స్ట్రయిక్ రేటు 141.15గా ఉంది.
రిషబ్ పంత్
వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. అసలు సిసలు టీ20 ఆటగాడైన పంత్ తన పేరును టెస్టుల్లో లిఖించుకున్నాడు. ఈ ఏడాది 7 టెస్టులు ఆడిన పంత్.. 61.81 సగటుతో 680 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 4 అర్థ సెంచరీలు ఉన్నాయి. స్ట్రయిక్ రేటు 90.90గా ఉంది. ఇక ఈ ఏడాది 12 వన్డేలు ఆడిన పంత్, 37.33 సగటుతో 336 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు అర్థ సెంచరీలు ఉన్నాయి. ఇక 25 టీ20ల్లో ఒక అర్థ సెంచరీ సాయంతో 364 పరుగులు చేశాడు. మొత్తంగా ఈ ఏడాది 43 మ్యాచులు ఆడిన పంత్, 37.29 సగటుతో 1,380 పరుగుల స్కోరు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఏడు అర్థ సెంచరీలు ఉన్నాయి.
In 2022 –
Rishabh Pant best Indian batter in Tests
Shreyas Iyer best Indian batter in ODIs
Surya Kumar Yadav best Indian batter in T20IsShreyas was good in all 3 formats meanwhile Pant was also good in ODIs with his 125* in Manchester and Kohli was good in T20Is. pic.twitter.com/CiMaLCfY2C
— Cricket🏏 Lover // ICT Fan Account (@CricCrazyV) December 25, 2022