బజ్‌బాల్ స్ట్రాటజీతో టెస్టు క్రికెట్లో కొత్త చరిత్ర రాస్తున్న ఇంగ్లండ్ మరో అద్భుత విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. న్యూజిలాండ్‌ను వారి గడ్డపైనే ఓడించి చరిత్ర సృష్టించింది.
ఇంగ్లండ్ తమ బజ్‌బాల్ దెబ్బను న్యూజిలాండ్‌కు కూడా రుచిచూపించింది. రెండు టెస్టుల సిరీస్ కోసం న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన స్టోక్స్ సేన ఈ నెల 16న మౌంట్ మౌంగనుయిలోని బే ఓవల్‌లో ప్రారంభమైన తొలి టెస్టును నాలుగో రోజే ముగించింది. ఈ విజయంతో 15 ఏళ్లుగా మోస్తున్న చెత్త రికార్డును ఇంగ్లండ్ జట్టు తుడిపేసుకుంది. గత 15 ఏళ్లుగా ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌లో ఒక్కటంటే ఒక్క టెస్టు మ్యాచ్ కూడా గెలవలేదు. తాజా విజయంతో ఆ చెత్త రికార్డును బద్దలు కొట్టింది. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్కల్లమ్ ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ కోచ్‌గా వెళ్లినప్పటి నుంచి ఆ జట్టు ఆటతీరు పూర్తి మారిపోయింది. అగ్రెసివ్ క్రికెట్‌తో టెస్టు క్రికెట్‌కే కొత్త కళ తెచ్చారు. దాన్ని క్రికెట్ అభిమానులు ‘బజ్‌బాల్’ అని ముద్దుగా పిలుస్తున్నారు. ఇప్పుడు అదే బజ్‌బాల్ స్ట్రాటజీతో సొంత దేశం న్యూజిలాండ్‌ను ఓడించాడు మెక్కల్లమ్.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఓపెనర్ బెన్ డకెట్ 67 బంతుల్లో 84, హ్యారీ బ్రూక్ 81 బంతుల్లో 89 ఎప్పటిలాగే అగ్రెసివ్ క్రికెట్ ఆడారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ గట్టిగానే పోరాటం చేసింది. 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశ నుంచి 306 పరుగులు చేసి ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ వికెట్ కీపర్ టామ్ టామ్ బ్లండెల్ (138) పరుగులతో చెలరేగడంతో కివీస్ 300 మార్క్ దాటగలిగింది. టాపార్డర్‌లో ఓపెనర్ లాథమ్, కేన్ విలియమ్సన్, హెన్రీ నికోలస్ దారుణంగా విఫలం అయ్యారు.
ఇక ఇంగ్లండ్ బౌలర్లలో సీనియర్ పేసర్ జెమ్స్ అండర్సన్ 3 వికెట్లతో రాణించగా.. రాబిన్సన్ 4 వికెట్లు తీసుకున్నాడు.ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 374 పరుగులకే ఆలౌట్ అయింది. జో రూట్ 57, హ్యారీ బ్రూక్ 54, ఫోక్స్ 51 హాఫ్ సెంచరీలతో రాణించారు. 394 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ను ఇంగ్లండ్ సీనియర్ పేస్ దళం అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ వణికించారు. చెరో నాలుగు వికెట్లతో చెలరేగి.. న్యూజిలాండ్‌ను 126 పరుగులకే కుప్పకూల్చారు. రాబిన్సన్, జాక్ లీచ్ చెరో వికెట్ తీసుకోవడంతో ఇంగ్లండ్‌కు 267 పరుగుల భారీ తేడాతో విజయం దక్కింది. ఈ మ్యాచ్‌తో ఇంగ్లండ్ 15 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్‌లో టెస్టు మ్యాచ్ గెలిచింది. మరి ఈ విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Anderson claims four wickets as England beat New Zealand on Kiwi soil after 15 years#ENGvsNZ #BazBall https://t.co/5bIL6Nnanh pic.twitter.com/xwBcZ7ZhOA
— Sports Tak (@sports_tak) February 19, 2023