క్రికెట్ మ్యాచ్ లో బ్యాటర్ ను అవుట్ చేసినప్పుడు బౌలర్ సంబరాలు చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. అయితే తాజాగా జరిగిన ఓ మ్యాచ్ లో బ్యాటర్ ను అవుట్ చేసిన బౌలర్ గ్రౌండ్ లో చేసిన విన్యాసాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరిగే సందర్భాల్లో మైదానాల్లో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. బ్యాటర్, బౌలర్ పై పైచేయి సాధించి వార్నింగ్ లు ఇవ్వడం.. ఇక బ్యాటర్లను అవుట్ చేసిన ఆనందంలో బౌలర్లు సెలబ్రేషన్స్ చేసుకోవడం మనం చరిత్రలో చాలానే చూశాం. అయితే తాజాగా జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్ లో వికెట్ తీసిన బౌలర్ తన సంతోషాన్ని అద్భుతమైన విన్యాసాలతో సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ వీడియోనే ఐసీసీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
వన్డే ప్రపంచ కప్ -2023 క్వాలిఫయర్స్ మ్యాచ్ లు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఐసీసీ వరల్డ్ కప్ లీగ్-2లో భాగంగా.. నేపాల్ వర్సెస్ యూఏఈ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ నేపాల్ కు డూ ఆర్ డై మ్యాచ్.. ఇందులో గెలిస్తేనే వరల్డ్ కప్ క్వాలిఫైయర్ ఆశలు సజీవంగా ఉంటాయి. అలాంటి మ్యాచ్ లో నేపాల్ తన సత్తా చూపింది. 42 పరుగుల తేడాతో యూఏఈని మట్టికరిపించింది. ఇక ఈ మ్యాచ్ ఓ అద్భుత ఘట్టానికి వేదికైంది. వివరాల్లోకి వెళితే.. నేపాల్ సాధించిన విజయంలో కీలక పాత్ర పోషించాడు ఆ జట్టు స్పిన్నర్ దీపేంద్ర సింగ్. 8 ఓవర్లలో కేవలం 18 రన్స్ మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లను పడగొట్టాడు.
ఇక ఈ మ్యాచ్ లో అద్భుతంగా ఆడుతున్న ఆసిఫ్ ఖాన్(82) రిటర్న్ క్యాచ్ తో అవుట్ చేశాడు దీపేంద్ర సింగ్. అనంతరం అతడు సెలబ్రేట్ చేసుకున్న విధానం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆసిఫ్ ఖాన్ వికెట్ తీసిన అనంతరం దీపేంద్ర సింగ్ గ్రౌండ్ ఓ సింగ్ లా గెంతులేశాడు. గాల్లో పల్టీలు కొడుతూ.. ఓ జిమ్నాస్టిక్ ప్లేయర్ ని గుర్తుకు తెచ్చాడు. దాంతో ఈ వీడియో చూసిన అభిమానులంతా.. ఇలాంటి సెలబ్రేషన్స్ మేము ఇంతవరకు చూడలేదని కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. జట్టులో భీమ్ షార్కి(70), ఆరిఫ్ షేక్(43) పరుగులతో రాణించారు. అనంతరం 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ జట్టు 45 ఓవర్లకు 187 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జట్టులో ఆసిఫ్ ఖాన్(82), ఆర్యన్ లాక్రా(50) పరుగులు చేసి జట్టును గెలిపించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దాంతో నేపాల్ వరల్డ్ కప్ క్వాలిఫైయర్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది.