డేవిడ్ వార్నర్.. క్రికెట్ వరల్డ్ లో ఇప్పుడు ఈ పేరు ఒక సంచలనం. నిజానికి ఈ వరల్డ్ కప్ మొదలయ్యే ముందు వరకు వార్నర్ విపరీతమైన ఒత్తిడిలో ఉన్నాడు. ఫేమ్ కోల్పోయి టీమ్ లో కూడా స్థానం ప్రశ్నార్ధకం అనిపించే స్థితికి వెళ్ళిపోయాడు. ఇక వరల్డ్ కప్ కి ముందు జరిగిన ఐపీఎల్ లో వార్నర్ ఎదుర్కొన్న అవమానాలు అన్నీ ఇన్నీ కాదు. సన్ రైజర్స్ యాజమాన్యం వార్నర్ ని టీమ్ నుండి తప్పించింది. అతనికి కనీసం డగౌట్ లో కూడా స్థానం ఇవ్వకుండా అవమానించింది. ఒకప్పుడు సన్ రైజర్స్ జట్టుని విజేతగా నిలిపిన వార్నర్ ని అలా చూడాల్సి రావడం ఫ్యాన్స్ కి సైతం ఇబ్బందిగా మారింది. అలాంటి అవమానకర స్థితిలో నే వార్నర్ సన్ రైజర్స్ కి దూరమయ్యాడు. కానీ.. డేవిడ్ వార్నర్ వరల్డ్ కప్ లో మెరుపులు మెరిపించాడు.
మొత్తం టోర్నమెంట్ లో 289 పరుగులు చేసి.. ఆస్ట్రేలియా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు ఇంతేకాదు.. కీలకమైన సెమీస్, ఫైనల్ మ్యాచ్ లలో అర్ధ సెంచరీలు సాధించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డుని సైతం దక్కించుకున్నాడు. సో.. ఇప్పుడు వార్నర్ ని వదులుకుని సన్ రైజర్స్ ఎంత తప్పు చేసిందో వారికి అర్ధం అయ్యింది. ఇప్పుడు ఎస్.ఆర్.హెచ్ రిటైన్ చేసుకుంటామన్నా.. వార్నర్ దానికి ఒప్పుకోడు. కాబట్టి.. వార్నర్ మెగా ఆక్షన్ లోకి రావడం ఖాయం. అయితే.. ఈ ఆక్షన్ లో మూడు టీమ్స్ వార్నర్ ని దక్కించుకోవడానికి పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది.
అహ్మదాబాద్, లక్నో జట్లు ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు జట్లకు ఇప్పుడు కీలకమైన విదేశీ ఆటగాళ్లు కావాలి. కానీ.., బాగా ఆడే ప్లేయర్స్ అంతా వేరే టీమ్స్ లో సెటిల్ అయిపోయారు. వారిలో స్టార్ ఆటగాళ్ళని ఆయా టీమ్ లు ఎలాగో రిటైన్ చేసుకుంటాయి. ఈ నేపథ్యంలోనే అహ్మదాబాద్, లక్నో జట్లు కన్ను.. డేవిడ్ వార్నర్ పై పడింది. మెగా ఆక్షన్ లో ఈ టీమ్స్ చేతిలో ఎక్కువ డబ్బు ఉంటుంది. కాబట్టి.., ఎంత ఖర్చైనా సరే వార్నర్ ని దక్కించుకోవాలని అహ్మదాబాద్, లక్నో జట్లు ఎదురుచూస్తున్నాయి. పైగా.., వార్నర్ జట్టులో ఉంటే అతన్ని కెప్టెన్ గా చేసుకోవచ్చు.
గతంలో వార్నర్ కెప్టెన్సీ లోనే సన్ రైజర్స్ ఐపీఎల్ టైటిల్ దక్కించుకుంది. కాబట్టే ఇప్పుడు డేవిడ్ వార్నర్ కి ఇంత డిమాండ్. నిజానికి ఈ రెండు కొత్త జట్లే కాదు. బెంగుళూరు జట్టు కూడా వార్నర్ ని దక్కించుకోవడానికి ఆసక్తి చూపిస్తోంది. ఆ జట్టుకి ఇప్పుడు కొత్త కెప్టెన్ కావాలి. వార్నర్ లాంటి ఆటగాడు ఆక్షన్ లో ఉండటంతో అతని కోసం ఆర్సీబీ వేలంలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. మరి.. ఈ నేపథ్యంలో డేవిడ్ వార్నర్ ని ఏ జట్టు సొంతం చేసుకుంటుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.