ఓ ప్రముఖ ఛానెల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్‌లో చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే.. ఆ స్టింగ్ ఆపరేషన్ ఓ పక్కా ప్లాన్ ప్రకారం జరిగినట్లు సమాచారం. బోర్డులో వారి ఆధిపత్యం తగ్గించేందుకు ఈ స్టింగ్ ఆపరేషన్ జరిపినట్లు వార్తలు వస్తున్నాయి.
చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మపై స్టింగ్ ఆపరేషన్ ఇండియన్ క్రికెట్‌లో అలజడి సృష్టించింది. మంగళవారం రాత్రి నుంచి ఈ స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ జరిపిన ఈ స్టింగ్ ఆపరేషన్‌లో భారత జాతీయ జట్టు చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. విరాట్ కోహ్లీ-సౌరవ్ గంగూలీ మధ్య వివాదం, కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడం, కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య ఇగో ఫైట్, ఆటగాళ్లు ఇంజెక్షన్ తీసుకుంటారంటూ.. ఆయన చాలా విషయాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. అడ్డంగా దొరికిపోయారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పటికైతే బీసీసీఐలో నివురుగప్పిన నిప్పులా ఉన్నా.. రేపో మాపో పెను విస్పోటనం సంభవించే అవకాశం ఉంది. చేతన్ శర్మ వీడియోపై బీసీసీఐ పూర్తి స్థాయిలో ఇప్పటికే దృష్టి సారించినట్లు సమాచారం. ఒక వైపు ఇలా చేతన్ శర్మ స్టింగ్ ఆపరేషన్ వీడియో తీవ్ర దుమారం రేపుతుంటే.. మరోవైపు ఈ స్టింగ్ ఆపరేషన్ మొత్తం ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
బీసీసీఐలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కుమారుడు జైషా కార్యదర్శిగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత క్రికెట్‌ను ఆయన ఏలుతున్న విషయం బహిరంగ రహస్యమే. అయితే.. బోర్డులోని కొందరు పెద్దలు ఈ విషయంపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. బోర్డు నిర్ణయాల్లో ఒంటెద్దు పోకడ పెరిగి పోయిందని, పైగా బోర్డు వ్యవహారాల్లో రాజకీయ జోక్యం బాగా ఎక్కువ కావడంతో.. బోర్డులోని కొందరు పెద్దలు జైషాకు చెక్ పెట్టేందుకు ఈ స్టింగ్ ఆపరేషన్‌ను పక్కా ప్లాన్ ప్రకారం చేయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. జైషాకు అడ్డుగా ఉన్న మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీని బీసీసీఐ ఛైర్మన్‌గా తప్పించి.. అతని స్థానంలో తమ మాట విని, ఏం చెప్పినా తలూపే రోజర్ బిన్నీ లాంటి ఓ నామమాత్రపు ఛైర్మన్ తీసుకొచ్చి పెట్టారని, దాంతో.. బీసీసీఐని తమ కనుసన్నల్లో నడిపిస్తున్నారంటూ బోర్డులోని కొంతమంది పెద్దలు గతంలో తమ సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది.
ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడేందుకు బోర్డులో జైషా పెత్తనానికి అడ్డుకట్ట వేసేందుకు.. చేతన్ శర్మను ఓ పాపులా వాడుకున్నట్లు తెలుస్తోంది. అతనిపై స్టింగ్ ఆపరేషన్ చేయించిన తర్వాత బోర్డు వ్యవహరాల్లో అలజడి సృష్టించి.. జైషాను సాగనంపలానే ప్లాన్‌తో ఈ స్టింగ్ ఆపరేషన్ చేయించినట్లు సమాచారం. చేతన్ శర్మ.. జైషాకు అత్యంత సన్నిహితుడు, పైగా బీజేపీ నేత కూడా. 2022 టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా వైఫల్యంలో తర్వాత చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీని బీసీసీఐ రద్దు చేసి.. మళ్లీ అతన్నే చీఫ్ సెలెక్టర్‌ను చేసింది. ఈ వ్యవహారం వెనుక జైషా ఉన్నట్లు బోర్డు పెద్దలు భావిస్తున్నారు. తమకు అనుకూలంగా లేని సెలెక్షన్ కమిటీలోని కొంతమంది పూర్తిగా తప్పించి.. చేతన్ లాంటి నమ్మిన బంటూ మళ్లీ సెలెక్టర్‌గా నియమించడం కూడా బీసీసీఐ లోని పాత సభ్యులు కొంతమంది ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. అందుకే.. ఒక పథకం ప్రకారం ఈ స్టింగ్ ఆపరేషన్ జరిపించినట్లు సమాచారం. మరి ఈ వ్యవహారంలో బీసీసీఐ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
We Stand With Chetan Sharma pic.twitter.com/Og0SE9QcpZ
— ً (@Ro45Goat) February 14, 2023