అసలు వయసు ఎంతున్నా, తక్కువ వయసు చూపించి టీమ్‌లోకి వచ్చే క్రికెటర్లు ఎందరో. భారత జట్టులో ఇలాంటి మోసాలు తక్కువే కానీ పాకిస్తాన్ మాత్రం ఈ విషయంలో చాలా ఫేమస్. అలాంటి వయసు దొంగల పని పట్టేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించబడిన సరికొత్త సాఫ్ట్‌వేర్ సేవలను వినియోగించుకోనుంది.. బీసీసీఐ.
ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందంటే..
గతేడాది.. అండర్ 19 వరల్డ్ కప్ 2022 గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న రాజవర్థన్ హంగర్కేకర్ వయసు గురించి చాలా పెద్ద రచ్చే జరిగింది. రాజవర్థన్ తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించి, వయసు తక్కువగా చూపించి తమను మోసం చేశాడంటూ మహారాష్ట్ర క్రీడా శాఖ, బీసీసీఐకి లేఖ రాసింది. అయితే ఈ ఆరోపణలను సీరియస్‌గా తీసుకోని బీసీసీఐ, హంగర్కేకర్‌ను ఐపీఎల్ ఆడనిచ్చింది. అయితే.. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఉండేదుకు వీలుగా ఓ సాఫ్ట్‌వేర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది.
ప్రస్తుతం వయసు సంబంధిత మోసాలను గుర్తించేందుకు బీసీసీఐ టీడబ్ల్యూ3 (ఎడమ చేయి, మణికట్టు ఎక్స్‌రే ఆధారంగా) విధానాన్ని ఉపయోగిస్తోంది. ఈ విధానంలో ఒక్కో పరీక్షకు రూ.2400 ఖర్చవుతోంది. అంతేకాకుండా 3-4 రోజుల సమయం పడుతోంది. అదే బీసీసీఐ తీసుకొస్తున్న.. ‘బోన్ ఎక్స్‌పర్ట్’ సాఫ్ట్‌వేర్ సాయంతో అయితే ఫలితం క్షణాల్లో రావడంతో పాటు ఖర్చు కూడా రూ. 288 రూపాయలే అవుతుంది. దీంతో బీసీసీఐ ఈ సాఫ్ట్‌వేర్ సాయంతో వయసు దొంగల ఆట కట్టించాలని నిర్ణయించింది. దీంతో పాటు సంప్రదాయ టీడబ్ల్యూ3 టెస్ట్‌ను నిర్వహిస్తామని బీసీసీఐ పేర్కొంది.
ఇన్నాళ్లు వయసు నిర్ధారణ ఇలా..
క్రికెటర్ల వయసును నిర్దారించేందుకు గాను రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌లు ముందుగా తమ ఆధ్వర్యంలో నడిచే ఎక్స్‌రే సెంటర్లలో బీసీసీఐకి చెందిన అధికారి సమక్షంలో పరీక్షలు జరిపి వాటిని ముంబైలో ఉన్న బీసీసీఐ ఏవీపీ డిపార్ట్‌మెంట్‌కు పంపిస్తాయి. రేడియాలజిస్టులు ఆ శాంపిల్స్‌ను పరీక్ష చేసి నాలుగు రోజుల తర్వాత ఫలితాలను వెల్లడిస్తారు. ఈ విధంగా అన్ని రాష్ట్రాల అసోసియేషిన్ల నుంచి పంపిన శాంపిల్స్ అన్నీ పరీక్షించి ఫలితాలు వెల్లడించేసరికి కనీసం రెండు నెలల సమయమైనా పడుతుంది.
ఇది కూడా చదవండి: BCCI అంటే ఆ మాత్రం ఉండాలే..! రూ. 4 కోట్లు నజరానా ఇచ్చి రూ. 18 కోట్లుగా లెక్క చూపారు!
ఇది కూడా చదవండి: Dinesh Karthik vs Murali Vijay: దినేశ్ కార్తీక్ మొదటి భార్య, మురళీ విజయ్ సతీమణిగా ఎలా అయ్యింది..?