మూడు వన్డేల సిరీస్ లో బంగ్లాదేశ్ 1-0తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసందే. ఢాకా వేదికగా జరిగిన తొలి వన్డేలో బంగ్లా వికెట్ తేడాతో విజయాన్ని అందుకుంది. చివరి వికెట్ కు మెహిదీ హసన్- ముస్తాఫిర్ రెహ్మాన్ జోడి 51 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని జోడించి బంగ్లాకు అద్భుత విజయాన్ని అందించారు. ఇక ఇరుజట్ల మధ్య డిసెంబర్ 7న అదే వేదికగా రెండో వన్డే జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బంగ్లా కోచ్.. రస్సెల్ డొమింగో మీడియాతో మాట్లాడారు. భారత్ పై సిరీస్ గెలవడానికి ఇదొక సువర్ణావకాశం అని చెప్పిన అతను.. ఇండియాను గెలవనివ్వమన్నట్లుగా మాట్లాడాడు.
తొలి వన్డేలో గెలిచే అవకాశం ఉన్నా.. భారత్ దాన్ని చేజార్చుకుందనే చెప్పాలి. మెహిదీ హసన్ ఇచ్చిన క్యాచ్ నేలపాలు చేసిన కేఎల్ రాహుల్.. విజయాన్ని దూరం చేశాడు. ఇదిలాఉంచితే.. పదో వికెట్ కు ముస్తాఫిజుర్ రెహ్మాన్- మెహిది హసన్ జోడి పోరాడిన తీరు అద్బుతమనే చెప్పాలి. ఏకంగా చివరి వికెట్ కు 51 పరుగులు జోడించి బంగ్లాకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఈ విజయంతో రెండో వన్డేలో బంగ్లా ఆటగాళ్లు పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ జట్టు కోచ్ రస్సెల్ డొమింగో సైతం ఇదే విషయాన్ని తెలిపాడు.
తొలి వన్డేలో విజయం సాధించినందుకు ఆటగాళ్లను ప్రశంసించిన అతడు.. రెండో వన్డేలో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలంటే మరింత మెరుగైన ప్రదర్శన అవసరమని తెలిపాడు. “భారత్ తో గతంలో జరిగినా.. అన్ని మ్యాచుల్లాగానే ఈ మ్యాచ్ సాగింది. 59/4 ఉన్నప్పుడు.. మేము చాలా మంచి స్థితిలో ఉన్నాము. కానీ, వరుసగా వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ పై పట్టు కోల్పోయే స్థితికి చేరుకున్నాం. అయినప్పటికీ మంచి విజయాన్ని అందుకున్నాం. బంగ్లాదేశ్‌లో మా రికార్డు చాలా బాగుంది. ప్రపంచంలోని పెద్ద జట్లలో ఒకటైన భారత్‌పై సిరీస్ గెలవడమంటే కష్టంతో కూడుకున్న పనే. మొదటి మ్యాచ్ గెలిచాం కనుక.. సిరీస్ గెలవడానికి ఇదో మంచి అవకాశం. గెలుస్తామన్న నమ్మకముంది. అది జరగాలంటే.. ఆటగాళ్లు మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాలి.. ప్రతి డిపార్ట్‌మెంట్‌లో మెరుగుపడటానికి ప్రయత్నించాలి..” అని చెప్పుకొచ్చాడు.