ఎప్పుడైతే ఇండియా IPL టోర్నీని ప్రారంభించిందో.. అప్పటి నుంచి చాలా దేశాలు ఇండియాను ఫాలో అయ్యి, టీ20 లీగ్ లను ప్రారంభించాయి. తాజాగా సౌతాఫ్రికా సైతం ఐపీఎల్ తరహాలో టీ20 లీగ్ ను స్టార్ట్ చేసింది. ఇక ఇప్పటికే కరేబియన్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియం లీగ్, బిగ్ బాష్ లీగ్ లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ టోర్నీల ద్వారా కొత్తకొత్త ప్లేయర్స్ వెలుగులోకి వస్తున్నారు. బ్యాట్ తో బంతితో విజృంభిస్తూ.. ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కొడుకు ఆజం ఖాన్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో దుమ్మురేపాడు. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లను ఉతికి ఆరేశాడు. చిట్టగాంగ్ ఛాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆజం ఖాన్ సెంచరీతో చెలరేగాడు.
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా చిట్టగాంగ్ ఛాలెంజర్స్ వర్సెస్ ఖుల్నా టైగర్స్ మధ్య సోమవారం మ్యాచ్ జరిగింది. హోరాహోరిగా సాగిన ఈ మ్యాచ్ లో 9 వికెట్లతో చిట్టగాంగ్ ఛాలెంజర్స్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో రెండు సెంచరీలు నమోదు కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన ఖుల్నా టైగర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును సెంచరీతో ఆదుకున్నాడు ఆజం ఖాన్. క్రీజ్ లోకి వచ్చీరావడంతోనే సిక్స్ లు, ఫోర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 58 బంతులు ఎదుర్కొన్న ఆజం ఖాన్ 9 ఫోర్లు, 8 సిక్స్ లతో 109 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ క్రమంలోనే టీ20ల్లో తన తొలి శతకాన్ని నమోదు చేసుకున్నాడు అజం ఖాన్. భారీ కాయంతో అలవోకగా బౌండరీలు బాదుతూ.. బౌలర్లను బెంబేలెత్తించాడు. 187 స్టైక్ రేట్ తో ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ చేశాడు ఈ నవయువ బాహుబలి.
Azam Khan’s maiden T20 hundred is a cracking one 💥 #BPL2023 pic.twitter.com/xzCFe18BCN
— ESPNcricinfo (@ESPNcricinfo) January 10, 2023
అనంతరం 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చిట్టగాంగ్ ఛాలెంజర్స్ కేవలం ఒకేఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. చిట్టగాంగ్ ఓపెనర్ బ్యాటర్ ఉస్మాన్ ఖాన్.. టైగర్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఉస్మాన్ ఖాన్ 58 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్ లతో 103 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. మరో ఓపెనర్ మాక్స్ ఓడౌడ్ 58 రన్స్ తో అతడికి అండగా నిలిచాడు. ఆజం ఖాన్ సెంచరీ చేసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. దాంతో అతడి భారీ శతకం వృథాగా మారింది. ఆజం ఖాన్ ప్రముఖ పాక్ మాజీ క్రికెటర్ అయిన మెుయిన్ ఖాన్ కుమారుడు కావడం గమనార్హం. ఇతడు ఇదే విధంగా రాణిస్తే మరికొన్ని రోజుల్లోనే పాక్ జట్టులో స్థానం సంపాదించుకోవడం ఖాయం అని దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు.
✅ First 💯 in T20 cricket for both players
🔥 Reached their landmarks with a sixTwo 🇵🇰 batters smashed their personal bests in #BPL2023 last night in the SAME match!
— ESPNcricinfo (@ESPNcricinfo) January 10, 2023