ఆసియా కప్ టోర్నీలో కీలక ఘట్టం వచ్చేసింది. లీగ్ మ్యాచులు ముగియడంతో.. అర్హత సాధించిన నాలుగు జట్లు సూపర్- 4 సమరానికి సిద్ధమయ్యాయి. మొదటి మ్యాచులో శ్రీలంక- ఆఫ్ఘనిస్తాన్ తలపడనుండగా, ఆదివారం భారత జట్టు, పాకిస్తాన్ ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచుకు పలు మార్పులతో టీమిండియా బరిలోకి దిగనుంది. లీగ్ దశలో రెండు మ్యాచుల్లోనూ బెంచ్ కే పరిమితమైన టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్.. ఈ మ్యాచులో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.
వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా.. మరోసారి దాయాదీ పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఆదివారం దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ మరోసారి అభిమానులను కనువిందు చేయనుంది. తొలి మ్యాచ్ తరహాలోనే పాక్‌ను మళ్లీ ఓడించి తమ జోరు కొనసాగించాలని రోహిత్ సేన భావిస్తుండగా.. గత పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ భావిస్తోంది. ఈ మ్యాచుకు భారత జట్టులో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. లీగ్ దశలో రెండు మ్యాచుల్లోనూ బెంచ్ కే పరిమితమైన టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్.. ఈ మ్యాచులో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. టాప్-5 బ్యాటర్లలో అంతా రైట్ హ్యాండర్స్ ఉన్న నేపథ్యంలో పంత్‌కు చోటివ్వడం తప్పనిసరి అవుతోంది.
ఇక.. గాయంతో టోర్నీ నుండి వైదొలిగిన రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్ కు స్థానం దక్కడం ఖాయం. అలా అయితే.. డీకేను తప్పించనున్నారా? అన్నది ఇక్కడ ప్రశ్న. జడేజా ఉన్నప్పుడు అతన్ని నాలుగో స్థానంలో ఆడించి సక్సెస్ అయిన భారత జట్టు.. అదే ఫార్మూలాను మరోసారి కొనసాగించొచ్చు. అక్షర్ పటేల్ లెఫ్టార్మ్ బ్యాటర్ అయినప్పటికీ టాపార్డర్‌లో ఆడించే సాహసం చేయకపోవచ్చు. దీంతో పంత్ కు చోటు దక్కడం ఖాయం. అలాగే.. రెండు మ్యాచుల్లోనూ తేలిపోయిన అవేశ్ ఖాన్ ప్లేస్ లో రవి బిష్ణోయ్ బరిలోకి దిగొచ్చు. అందులోనూ దుబాయ్ పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తున్న నేపథ్యంలో బిష్ణోయ్ ఆడటం ఖాయమనిపిస్తోంది.
మొత్తంగా చూస్తే.. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ కంఫర్మ్ కాగా, ఫస్ట్ డౌన్‌లో విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతాడు. నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఐదో స్థానంలో రిషభ్ పంత్, ఆరో స్థానంలో హార్దిక్ పాండ్యా బరిలోకి దిగనున్నారు. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ జట్టులోకి రానుండగా.. యుజ్వేంద్ర చాహల్ స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కొనసాగనున్నాడు. భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యాతో పేస్ బాధ్యతలను పంచుకోనున్నారు. పాక్ పోరులో మరోసారి భారత జట్టు విజయం సాధిస్తుందా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
పాక్ తో తలపడబోయే భారత జట్టు(అంచనా):
రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్.