న్యూజిలాండ్, ఇంగ్లండ్ కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ బాగా హర్ట్ అయింది. టీ20 వరల్డ్ కప్‌లో ప్రతీకారం తీర్చుకుంటాం అనే దాకా వెళ్లిందంటే వాళ్లు ఎంత అవమానంగా భావించారో అర్థం అవుతుంది. పాకిస్తాన్‌తో పాకిస్తాన్‌లో క్రికెట్ ఆడేందుకు ఏ దేశం కూడా ముందుకు రావడం లేదు. ఇంతకు ముందు న్యూజిలాండ్ ఆ దేశానికి వచ్చి, భద్రతా కారణాల దృష్ట్య మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు సిరీస్‌ను రద్దు చేసుకుని వెళ్లిపోయింది. దాంతో న్యూజిలాండ్‌పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు మండిపడ్డారు. అనంతరం ఇంగ్లండ్ కూడా పాకిస్తాన్‌తో తమ సిరీస్ రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. న్యూజిలాండ్ చేసిన పనికే మండిపోతున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై కారం చల్లినంత పని చేసింది ఇంగ్లండ్.
ఇలా రెండు దేశాలు తమ దేశంతో క్రికెట్ ఆడేందుకు వెనకడుగు వేయడంతో పాకిస్తాన్ క్రికెట్‌లో తీవ్ర నిరాశ అలుముకుంది. ఈ పరిస్థితిలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆ దేశాలు రాకుంటే ఏంటీ మనం మనం ఆడుకుందాం అంటూ పాకిస్తాన్‌కు మద్దతు తెలిపింది. ఈ మేరకు అఫ్ఘనిస్తాన్ క్రికెట్ ఛైర్మన్ అజీజుల్లా ఫజ్లీ సెప్టెంబర్ 25 న పాకిస్తాన్ కు వెళ్లనున్నారు. అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ కోసం వారిని ఆహ్వానించడానికి పాకిస్తాన్ సందర్శిస్తానని చెప్పారు. ఇటీవలి కాలంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు అంతర్జాతీయ క్రికెట్‌లో ఎదగగలిగింది. ప్రపంచంలోని అగ్రశ్రేణి స్పిన్నర్ రషీద్ ఖాన్‌తో సహా జట్టులో కొంతమంది మంచి ఆటగాళ్లు ఉన్నారు. కాగా ఫజ్లీ పర్యటనను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమిజ్ రాజా కూడా ధృవీకరించారు.