శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజలు అద్భుతమైన మద్దతు తెలుపుతున్నారు. పాదయాత్ర 25వ రోజు కూడా ప్రజాదరణతో ముందుకు సాగుతోంది. లోకేష్ ఇప్పటివరకు 329.1 కి.మీ. నడిచారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 25వ రోజుకు చేరుకుంది. గురువారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 25వ రోజు పాదయాత్ర ప్రారంభం అయింది. జీలపాలెం (రేణిగుంట మండలం) క్యాంప్ సైట్ నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్రకు ముందు సెల్ఫీల కార్యక్రమం నిర్వహించారు. ప్రతి రోజులాగానే వెయ్యి మంది అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, సాధారణ ప్రజలతో ఆయన సెల్ఫీలు దిగారు. అనంతరం పాదయాత్రను ప్రారంభించారు. గాజులమాండ్యంలో ఎస్టీ సామాజికవర్గానికి చెందిన వారితో ఆయన భేటీ అయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు.
అనంతరం రేణిగుంట వై-కన్వెన్షన్ హాలులో ఆర్ఎంపీ డాక్టర్లతో సమావేశం అయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత యాదవ సామాజికవర్గీయులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ‘‘ పాలిచ్చే ఆవుని వద్దనుకున్నారు. ప్రజలను తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు. వైఎస్ జగన్ పాలనలో కార్పొరేషన్ చైర్మెన్లు డమ్మీలు. కనీసం కూర్చోడానికి కుర్చీ కూడా ఇవ్వలేదు. టీడీపీ హయాంలో రూ.278 కోట్లు కేవలం యాదవ సామాజిక వర్గం వారి సంక్షేమం కోసం ఖర్చు చేశాం. వైసీపీ పాలనలో యాదవుల సంక్షేమం కోసం ఖర్చు చేసింది సున్నా. పెన్షన్లు, అమ్మ ఒడి కూడా యాదవుల ఖాతాలో రాస్తున్నారు. ఆదరణ పథకాన్ని నాశనం చేశారు.
వెయ్యి కోట్ల రూపాయలతో టీడీపీ ప్రభుత్వం కొన్న పనిముట్లు కూడా వైసీపీ ప్రభుత్వం పంచలేదు. టీడీపీ హయాంలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన 34 శాతం రిజర్వేషన్లను జగన్ రెడ్డి 24 శాతానికి తగ్గించారు. 10 శాతం రిజర్వేషన్లు తగ్గడం వలన దాదాపు 16,500 మంది బీసీలు పదవులు కోల్పోయారు. బీసీలకు పుట్టినిల్లు టీడీపీ. బీసీల వెన్నుముక విరిచింది జగన్ రెడ్డి’’ అని అన్నారు. అనంతరం తన పాదయాత్రను కొనసాగించారు. రేణిగుంట బస్టాండు వద్ద షాప్ కీపర్స్‌తో లోకేష్ సమావేశం అయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు.