బద్వేల్ ఉప ఎన్నికల విషయంలో ఓవర్ కాన్ఫిడెన్స్‌గా ఉండకుండా బాధ్యతగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైసీపీ నేతలకు సూచించారు. గతంలో వచ్చిన మెజార్టీ కన్నా ఈ సారీ ఎక్కువ రావాలనే టార్గెట్ పెట్టారు. కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికపై గురువారం తాడేపల్లిలో క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా వెంకటసుబ్బయ్య అకాల మరణంతో బద్వేల్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఆయన సతీమణి దాసరి సుధను తమ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబెడుతున్నామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
గెలుపు బాధ్యతలను సమావేశానికి వచ్చిన నేతలందరికి అప్పగించారు. నామినేషన్ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని సూచించారు. అభ్యర్థి సుధను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఎక్కడా అతి విశ్వాసం వద్దని.. కష్టపడి పనిచేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను హెచ్చరించారు. బద్వేల్ నియోజకవర్గ బాధ్యతలను మంత్రులు ఆదిమూలపు సురేష్, అంజాద్ బాషా, ఎంపీలు అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డికి కూడా బాధ్యతలు అప్పగించారు.
సోమవారం నుంచి పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకుని పోవాలని సూచించారు. ఒక్కో ఇంటికి కనీసం 3 నుంచి 4 సార్లు వెళ్లాలని చెప్పారు. 2019లో 77 శాతం ఓటింగ్ జరిగిందని.. ఈసారి ఓటింగ్ శాతం మరింత పెరగాలన్నారు.. పోలింగ్‌లో పాల్గొనేలా ఓటర్లలో చైతన్యం కల్పించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు జగన్.