తెలంగాణలో రాజకీయాల్లో వచ్చే నెల నుంచి పాదయాత్రలు మొదలుకానున్నాయి. దాదాపుగా అన్ని పార్టీల నేతలు రాబోయే రోజుల్లో పాదయాత్రలు చేయబోతున్నామని ప్రకటించారు. రాజకీయంగా ఉనికిని కాపాడుకునేందుకు పార్టీలన్నీ ఇదొక వ్యూహంగా భావిస్తున్నాయి. గతంలో ఎంతోమంది నేతలు పాదయాత్రలతో సక్సెస్ అయ్యి సీఎం పీఠంపై కూర్చుకున్నారు. స్వర్గీయ ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించాడు. పల్లె పల్లె తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేసి చాలా వరకు విజయం సాధించారనే చెప్పాలి.
ఇప్పుడు అదే పంధాలో వెళ్తున్నారు తెలంగాణలోని నేటి తరం రాజకీయ నాయకులు. ఇక హుజురాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైన వేళ అన్ని రాజకీయ పార్టీలు పాదయాత్ర మంత్రాన్ని జపించబోతున్నాయి. దీంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వచ్చే నెలలో పాదయాత్ర మొదలుపెడతామని తెలిపారు. ఇదిలా ఉండగా హుజురాబాద్ లో బలమైన బీసీ సమాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ కూడా పాదయాత్ర చేయనున్నానని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇక వీళ్ళతో పాటు తెలంగాణలో రాజన్న రాజ్యం రావాలంటున్న షర్మిల కూడా త్వరలో పాదయాత్ర చేయనున్నానని తాజాగా ప్రకటించింది. ఇలా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తెలంగాణ టీపీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి వంటి బడా నేతలు రానున్న రోజుల్లో పాదయాత్రలతో ప్రజల వద్దకు వెళ్లనున్నారు. మరి ఈ పాదయాత్రలతో ప్రజలకు చెప్పేదేంటి? ఈ వ్యూహం ఎవరికీ అనుకూలంగా మారబోతోంది.? అనే ప్రశ్నలకు సమాధానం మరికొన్ని రోజుల్లో తేలనుంది.