ఐపీఎస్ ఆఫిసర్ డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్…26 ఏళ్ల పోలీస్ సర్వీస్. నలుసంతైనా కనిపించని వ్యతిరేకత, పట్టి చుసిన అంటని అవినీతి మరకలు. ఉక్కులాంటి బలమైన మహామేధావి. తెలంగాణ గురుకులాల శక్తిని ఎల్లలు దాటించి, అట్టడుగు వర్గాల విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చిన గొప్ప అధికారి మన ప్రవీణ్ కుమార్. సాఫీగా సాగుతున్న ఉద్యోగ ప్రయాణం. ఇంకా మిగిలే ఉన్న 6 సంవత్సరాల పదవి కాలం. హఠాత్తుగా.. ఐపీఎస్ ఆఫిసర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా అంటూ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు. అసలు ఏం జరిగింది ?. ఉన్నట్టుండి రాజీనామాకు గల కారణాలేంటి?… ఇవే సగటు మేధావిని తొలిచేస్తున్న ప్రశ్నలు.
ఇలా ఎన్నో క్వాశ్చన్ లు, మరెన్నో అనుమానాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. దాదాపు 26 ఏళ్ల సుదీర్ఘ ప్రభుత్వ సర్వీసు నుండి, వ్యక్తిగత కారణాల వల్ల స్వచ్చంద పదవీ విరమణకు దరఖాస్తు చేస్తున్నానంటూ ప్రవీణ్ కుమార్ లేఖలో పేర్కొన్న కీలకమైన అంశాలు. దీంతో పాటు రెండున్నర దశాబ్దాల కాలం సర్వీసును అందించానని, ఇక 6 సంవత్సరాల పదవీ కాలం మిగిలే ఉన్నప్పటికీ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఇక ఎట్టకేలకు నా మనసుకి నచ్సిన పనులను, నాకు ఇష్టమైన రీతిలో చేయబోతున్నానంటూ రెండు పేజీల పత్రాన్ని ప్రభుత్వానికి పంపాడు ఈ డైనమిక్ పోలీస్ ఆఫీసర్.
ఇక ప్రధానంగా ప్రవీణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయటం రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చలకు తావిస్తోంది. ఉన్నపళంగా ఆయన ఈ నిర్ణయం తీసుకోవటం పట్ల మేధావి వర్గానికి కూడా ఆయన వ్యూహాలు అంతుచిక్కటం లేదనేది కాదనలేని వాస్తవం. కాగా లేఖలో మాత్రం మనసుకి నచ్చిన, ఇష్టమైన రీతిలో చేయబోతున్నానంటూ, మహాత్మా జ్యోతిబాపూలే దంపతుల, బి.ఆర్. అంబేడ్కర్, కాన్షీరామ్ బాటలోనే నడవబోతున్నానని తెలిపారు ప్రవీణ్ కుమార్. ఇక ఒకరకంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నాడన్న వార్తలు సైతం లేకపోలేదు.
దీంతో పాటు రానున్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో రాజకీయంగా అధికార పార్టీతో కలిసి పనిచేస్తారా? లేక విపక్షాలతో జత చేరి రాజకీయంగా ఎదగాలనుకుంటున్నారా? ఇవన్నీ కాకుండా ఏదైనా కొత్త ప్రాంతీయ పార్టీని పెట్టబోతున్నాడా? .. ఇవే ప్రవీణ్ కుమార్ అనూహ్య నిర్ణయం పట్ల కలుగుతున్న అనుమానాలు. ఈ నేపథ్యంలో ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగులు ఎటువైపు పడతాయని యావత్ తెలంగాణ ప్రజలు, దళిత మేధావులు ఎదురుచూస్తున్నారు. మరి ఇంతకు ఈ నాలుగో సింహం వెనకడుగు వేయటానికి బలమైన కారణమేంటన్న ప్రశ్నకు సమాధానం రావాలంటే మరి కొన్ని రోజులు ఆగక తప్పదేమో.