హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గెలుపే లక్ష్యంగా అడుగులు వేసింది. అయితే మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా అనంతరం హుజురాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. దీంతో ఎలాగైన హుజురాబాద్ లో గెలవాలని టీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతూ వచ్చింది. అయితే ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టి రూపకల్పన చేశారు.
ఈసీ నోటిఫికేషన్ వెలువడకముందు నుంచే ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. అయితే ఈ తరుణంలో ఉప ఎన్నికకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే దళిత బంధు పథకాన్ని నిలిపివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ అంశంపై తాజాగా హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈసీ అభ్యర్ధన విషయంలో మేము జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది.