నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి డాక్టర్లు ఇచ్చిన మెడికల్ రిపోర్ట్ ని న్యాయమూర్తి చదివి వినిపించారు. రఘురామరాజు కాలిపై గాయాలు ఉన్న మాట వాస్తవం. ఆయన ఎడమ కాలి బొటన వేలు ఫ్రాక్చర్ అయ్యి ఉంది. అలాగే.. కాలిపై ఉన్న అన్నీ ఎంకచ్ఛలు కూడా గాయాలు కాదు. రఘురా కృష్ణరాజు చాలా సంవత్సరాలుగా ఎడిమా అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఆ మచ్చలే అధికంగా ఉన్నాయి. ఎడమ కాలిపై మాత్రం గాయాలు ఉన్నట్టు న్యాయమూర్తి నివేదిక చదివి వినిపించారు. కానీ..,రఘురామరాజు కాలికి గాయం ఉందని సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి డాక్టర్లు ఇచ్చిన నివేదికపై సీఐడీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రఘురామరాజు తానే కాలికి గాయం చేసుకుని ఉండొచ్చని సీఐడీ న్యాయవాదులు తెలిపారు. గతంలో ఆయన కాలికి గాయమే కాలేదని గుంటూరు జీజీహెచ్ వైద్యులు నివేదిక ఇచ్చినప్పుడు స్పందించని సీఐడీ ఇప్పుడు రఘురామ తానే స్వయంగా గాయం చేసుకుని ఉండొచ్చని చేస్తున్న వాదన ఈ కేసులో మరో ట్విస్ట్గా మారింది.
రఘురామ గాయాన్ని సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నిర్ధారించిన నేపథ్యంలో ఆయన తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టులో ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీపై చిత్రహింసలు నిజమేనని నివేదిక చెబుతోందని.., ఓ ఎంపీకే ఇలా ఉంటే సామాన్యుల పరిస్ధితి ఏంటని ప్రశ్నించారు. రఘురామకు వెంటనే బెయిల్ మంజూరు చేయాలని, దీనిపై సీబీఐ విచారణ కూడా జరపాలని ఆయన కోర్టును కోరారు. రఘురామ గాయాలపై ఆర్మీ డాక్టర్లు ఇచ్చిన నివేదికపై స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం… ఆయనకు ముగ్గురు డాక్టర్లు వైద్యపరీక్షలు చేశారని, ఎక్స్రే, వీడియో కూడా పంపారని, రఘురామకు జనరల్ ఎడీమా ఉందని తెలిపింది. ఫ్రాక్చర్ కూడా ఉందని నివేదికలో ఉందని ధర్మాసనం వివరించింది. దీనితో రఘురామ కాలి గాయం ఎప్పుడు అయ్యింది అన్న విషయం ఇప్పుడు చర్చగా మారింది. ఒకవేళ గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ లో ఇచ్చిన నివేదికలో తప్పు ఉందని తేలితే మాత్రం.. రాష్ట్ర సీఐడీ అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తప్పకపోవచ్చు.