ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కరోజు బడ్జెట్ సెషన్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఒక్కరోజులోనే గవర్నర్ ప్రసంగం, కావాల్సిన తీర్మానాలు అన్నీ అయిపోయాయి. ఇక గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే అవకాశం వైసీపీ ఎమ్మెల్యే జోగీ రమేశ్ కి వచ్చింది. ఈ సందర్భంగా ఆయన పూర్తిగా ట్రాక్ తప్పి రఘురామ కృష్ణరాజుపై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ లేని వ్యక్తుల గురించి ప్రస్తావించకూడదన్న ఆలోచన కూడా లేకుండా జోగీ రమేశ్ రఘురామపై దారుణమైన పదజాలం వాడారు. మా సీఎం జగన్ బొమ్మ పెట్టుకుని గెలిచిన వాడు.., గత సంవత్సర కాలం నుంచి ప్రతిరోజు విషం కక్కుతున్నాడని, ప్రజల మనసులు గెలుచుకున్న తమ ప్రభుత్వ కార్యక్రమాలపై బురద చల్లుతున్నాడని విమర్శించారు. మా ప్రభుత్వం మీద మీసాలు తిప్పుతారు, తొడలు కొడతారు! ఈ సందర్భంగా నేను సవాల్ విసురుతున్నా. జగన్ బొమ్మ లేకుండా, మా జెండా లేకుండా, మా అజెండా లేకుండా నువ్వు గెలవాలి. నీ ఊరేదో నాకు తెలియదు కానీ…. కనీసం నువ్వు వార్డు మెంబర్ గానైనా గెలిచే సత్తా నీకు లేదని సవాలు విసిరారు జోగి రమేశ్. పచ్చమీడియా అండతో ప్రభుత్వంపై కుట్ర చేస్తావా? అంటూ హౌస్ లో రెచ్చిపోయారు జోగి రమేశ్. ఈ క్రమంలో ఆయన మాట్లాడిన భాష చాలా దారుణంగా ఉండటం గమనార్హం. కానీ.., అలాంటి భాష వాడుతున్న సమయంలో కూడా జోగి రమేశ్ మైక్ కట్ చేయలేదు.
చివరగా తన ప్రసంగంలో ఏవైనా తప్పులు ఉంటే మన్నించాలని, వాటిని రికార్డుల నుంచి తొలగించాలని జోగి రమేశ్ స్పీకర్ చివరిలో తమ్మినేని సీతారాంను కోరారు. ఇక్కడ ఇంకా దారుణం ఏమిటంటే.. జోగి రమేశ్ ప్రసంగం సీఎం జగన్ ను విశేషంగా ఆకట్టుకుంది. జోగి బాధలో తనపై ఎంతో ఆప్యాయత కనిపించిందని, అందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. తప్పు చేసి ఉంటే తన మాటలు రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ను కోరడం పట్ల అభినందిస్తున్నానని సీఎం జగన్ అన్నారు. ఇప్పుడు జోగి రమేశ్ పై మా అందరి అభిమానం కూడా కాస్త పెరిగింది అని వ్యాఖ్యానించారు. అయితే.., ఇక్కడే వైసీపీ నాయకుల తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. అనాల్సిన మాటలన్నీ అనేసి రికార్డ్స్ నుండి తొలగించండి అంటే ఎలా? ఏ కామెంట్స్ చేశారని రఘురామపై కేసు పెట్టారో.., అదే కామెంట్స్ మీరు అసెంబ్లీ సాక్షిగా ఎలా చేస్తారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో వైసీపీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.