ఏపీలో రాజకీయాలు రోజుకో కొత్త పుంతను తొక్కుతున్నాయి. ఒక్కో రోజు ఒక్కో మలుపుతీసుకుంటున్నాయి. నాయకులు పార్టీలు మారే విషయంలో కొత్త కొత్త ప్రచారాలు జరుగుతున్నాయి. అందులో ఏది నిజమో ఏది అబద్ధమో జనాలకు అర్థం కావటం లేదు.
ఏపీ రాజకీయాల్లో మహాసేన రాజేష్ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. జనసేన మద్దతుదారుడిగా ఆయనకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. జనసేనకు సంబంధించిన కార్యక్రమాల్లో రాజేష్ పాల్గొంటూ ఉంటారు. ముఖ్యంగా తన సోషల్ మీడియా ఖాతాల్లో జనసేనకు మద్దతుగా వీడియోలు, పోస్టులు పెడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే మహాసేన రాజేష్ జనసేనలో చేరతారని అంతా భావించారు. అయితే, రాజేష్ అందరూ అనుకున్నట్లుగా జనసేనలోకి కాకుండా టీడీపీలో చేరబోతున్నారనే ప్రచారం నడుస్తోంది. టీడీపీలో చేరిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తారన్న టాక్ నడిచింది. ఈ మేరకు గత కొద్దిరోజులనుంచి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి.
దీంతో జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు మహాసేన రాజేష్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజేష్.. జనసేనను మోసం చేశారంటూ మండిపడుతున్నారు. వీటన్నింటిపై మహాసేన రాజేష్ స్పందించారు. ఈ మేరకు బుధవారం తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. తాను జనసేనను మోసం చేయలేదని అన్నారు. తనకు జనసేన అంటే అభిమానం ఉన్నా.. కొన్ని కారణాల వల్ల టీడీపీ వైపు మొగ్గు చూపానన్నారు. ఇంకా ఆ పోస్టులో.. ‘‘ టీడీపీ మాది కాదనుకున్నప్పుడు కూడా టీడీపీపై జరుగుతున్న అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టాము.
దళిత బహుజనులకు వైసీపీ నిజస్వరూపాన్ని ఆధారాలతో సహా బయటపెట్టాము. ఇప్పటినుంచి టీడీపీ మాది.. చంద్రబాబు నాయుడు మా నాయకుడు. ఇకపై వైసీపీ చెప్పే అబద్ధాలను ఆధారాలతో తెలియజేస్తూ.. టీడీపీ చేసిన మేలును తెలుపుతాం. జనసైనిక సోదరులారా వైఎస్సార్ సీపీ చేస్తున్న ప్రచారాన్ని నమ్మోద్దు. నేను జనసేనను మోసం చేయలేదు. నేను మోసం చేశానని పార్టీలో ఒక్క నాయకుడితోనైనా చెప్పించండి. బోలిశెట్టి శ్రీను, కత్తిపూడి బాబీ, నాగబాబు, నాదెండ్ల మనోహర్‌లతో నేను మోసం చేశానని చెప్పించండి. అది నిజం అయితే, మీరు ఏది చేయమంటే అది చేస్తాను. పవన్ కల్యాణ్ అంటే మాకు అభిమానం. ఆయన్ని అభిమానిస్తూ జగన్‌పై పోరాడుతూ ఉన్న మమ్మల్ని కించపరుస్తూ మాట్లాడొద్దు’’ అని అన్నారు.
మహాసేన రాజేష్ గురించి జనసేన అభిమానులు, కార్యకర్తలు తప్పుగా మాట్లాడటంపై మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు స్పందించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో తాజాగా, ఓ పోస్టు పెట్టారు. రాజేష్ మహాసేన” గురించి జనసైనికులు ఎవరూ తప్పుగా మాట్లాడకండని అన్నారు. రాజేష్ ఏ పార్టీలో చేరాలనుకుంటున్నాడనేది అతని ఇష్టమని, అది అతడి ప్రజాస్వామ్య హక్కు అని నాగబాబు పేర్కొన్నారు. ఇక, నాగబాబు స్పందనతోనైనా జనసేన అభిమానులు, కార్యకర్తలు రాజేష్‌పై కామెంట్లు చేయటం ఆపుతారేమో వేచి చూడాలి. మరి, మహాసేన రాజేష్ టీడీపీలో చేరటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
“రాజేష్ మహాసేన” గురించి జనసైనికులు ఎవరూ తప్పుగా మాట్లాడకండి.
అతను ఏ పార్టీలో చేరాలనుకుంటున్నాడనేది అతని ఇష్టం.ఇది తన ప్రజాస్వామ్య హక్కు.
So, Respect whatever his decision is and wish him Good Luck.
— Naga Babu Konidela (@NagaBabuOffl) February 12, 2023