కొండా సురేఖ..తెలంగాణ రాజకీయాల్లో అప్పట్లో ఓ వెలుగు వెలిగారు. కాలంతో పాటు పరిస్థితులు మారుతున్న క్రమంలో రాజకీయాల్లో కాస్త లాంగ్ గ్యాప్ ఇచ్చినా మళ్లీ రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. 2009లో పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన సురేఖ రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగారు. స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో కొండా సురేఖ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, బధిరుల సంక్షేమ మంత్రిగా పనిచేశారు. ఇక అప్పట్లో వైఎస్ఆర్ కుటుంబంతో కొండా సురేఖకు విడదీయలేని బంధాన్ని ఏర్పరుచుకుంది.
ఆ తర్వాత వైఎస్‌ఆర్ మరణించటంతో తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేసింది. దీంతో వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడంతో ఆ పార్టీలో చేరిపోయి తెలంగాణలో పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు ప్రయత్నం చేసిందనే చెప్పాలి. ఇక తెలంగాణ ఉద్యమం ఉవ్వేత్తున సాగుతున్న క్రమంలో జగన్ తెలంగాణ ఏర్పాటుకు అడ్డుచెప్పటంతో జగన్ పార్టీకి కొండా సురేఖ రాజీనామా చేశారు. ఇక తదనంతర పరిణామాల మధ్య టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి రాజీనామా చేసి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఇక విషయమేమిటంటే..? తాజాగా ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది కొండా సురేఖ.
అయితే ఈ ఇంటర్వ్యూ లో సురేఖ తన రాజకీయ ప్రస్థానంతో పాటు తను ఎదుర్కొన్న ఎత్తుపళ్లాలను వివరించే ప్రయత్నం చేసింది. ఇక దీంతో పాటు కొత్తగా తెలంగాణలో రాజకీయ పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిలపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు సురేఖ. తనకు పొగరు, టెంపర్ ఎక్కువని అది రాజకీయాల్లో పనికి రాదంటూ బాహాటంగా చెప్పుకొచ్చింది. పెయిడ్ ఆర్టిస్ట్ మాదిరి నడుచుకుంటుందని తెలిపింది. ఆమె నిజస్వరూపం తెలంగాణలో పాదయాత్ర చేసినప్పుడే చూశానని తెలిపింది. ఇక రాజకీయాల్లో ప్రజలతో మంచి స్నేహపూరితంగా ఉంటే మాత్రమే ప్రజలు స్వాగతిస్తారని లేకుంటే రాజకీయాల్లో నిలవలేరని కొండా సురేఖ వ్యాఖ్యానించింది.