కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేరు ఈ మధ్య కాలంలో తరచుగా ఏదో వివాదంలో ప్రముఖంగా వినిపిస్తోంది. తరచుగా పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలస్తున్నారు. ఇక తాజాగా కోమటిరెడ్డి ఆడియో ఒకటి లీకై.. రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఆ వివరాలు..
కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. గత కొన్నిరోజులుగా పార్టీలో ఆయన తీరు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కోమటిరెడ్డి మాట్లాడిన ఆడియో అంటూ ఒక వీడియో కలకలం రేపుతోంది. దీనిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వాయిస్‌గా వినిపిస్తున్న ఒక ఫోన్ కాల్ రికార్డింగ్.. కాంగ్రెస్‌లోనే కాక రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెను సంచలనంగా మారింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వాయిస్‌లాగా చెప్పబడుతున్న ఆడియలో లీక్‌లో.. తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్‌తో పాటు ఆయన కుమారుడు డాక్టర్ చెరుకు సుహాస్‌ను తన అభిమానులు చంపుతారంటూ బెదిరిస్తున్నట్టుగా ఉన్న ఆడియో లీక్ ప్రస్తుతం కలకలం రేపుతోంది.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాయిస్‌గా చెప్పబడుతున్న స్వరం:‘చూసినవా స్టేట్ మెంట్’.
చెరకు సుహాస్:‘అంకుల్ అది వాట్సప్ అట్ల ఇచ్చిండు కానీ ఆ వీడియో ఒకసారి మీరు పూర్తిగా చూడండి’.
కో.వాయిస్: ‘‘ఏం చూసుడు. వాన్ని చంపుతామని తిరుగుతున్నారు. వంద మంది వెహికిల్ వేసుకుని తిరుగుతున్నారు. ఈ వీడియో కాదు నన్ను వందసార్లు తిట్టిండు. నెల రోజులు ఓపిక పట్టిండ్రు. ఇప్పుడు వంద కార్లలో వాడిని చంపుతామని తిరుగుతున్నారు. నిన్ను కూడా చంపుతారు. నీ ఆస్పత్రిని కూడా కూలగొడతారు. నేను లక్షల మందిని బతికించిన. వానికెంత ధైర్యం.. నిన్న మొన్న పార్టీలకొచ్చి నన్నే అంటాడా.. వాడిని వదిలిపెట్టర్రా. నేను చెబుతున్నా. నీకు కూడా వార్నింగ్ ఇస్తున్నా. నేను ఆపలేను’’ అన్నాడు.
కో.వాయిస్:‘‘క్షమించమని చెప్పి, నా పేరు తీసుకుని మొన్న స్టేట్ మెంట్లు ఇచ్చిండు. ఓపిక పట్టిండ్రు. ఇప్పుడు అట్ల కాదు.. వాడు యాడ దొరికితే ఆడ చంపేస్తామని అంటున్నారు. వాళ్లను ఆపుడు నా వల్ల కాదు. క్షమాపణ చెప్పకపోతే మాత్రం చంపేస్తారు. నిన్ను కూడా చంపుతారు చెబుతున్నా. అరేయ్ నీ ఆస్పత్రి కూడా నడువదు. అతడికి ఫోన్ చేసి చెప్పు. అరేయ్ నీకు ఉన్నదా రా? ఇంటి పార్టీ ఏందిరా? నువ్వు కౌన్సిలర్‌గా కూడా గెలవవు. ఆయన అంతపెద్ద లీడర్ అని చెప్పు. వాడు జైళ్లో పడితే నేను ఒక్కడినే పోయినా.. ఎవరూ రాలేదు. చెప్పు.. వారం కంటే ఎక్కువ ఉండడు వాడు’’ అని బెదిరిస్తున్న ఆడియో బయటకు వచ్చింది.
ఈ ఆడియో లీక్ పై చెరుకు సుధాకర్ రెడ్డి వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాక నల్లగొండ పట్టణంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. కోమటిరెడ్డిపై కేసు నమోదు చేయాలని చెరకు సుధాకర్ వర్గం డిమాండ్ చేసింది. మరోవైపు ఈ ఆడియో తనది కాదు అని కోమటిరెడ్డి క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం. ఇక గతంలో కూడా కోమటిరెడ్డి ఆడియోలు ఇలానే లీకయ్యి.. సంచలనం సృష్టించాయి. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఆయన తన తమ్ముడుకి మద్దతుగా.. పార్టీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేసిన ఆడియో లీకై సంచలనం సృష్టించింది. ఇక తాజాగా చెరుకు సుధాకర్, ఆయన కుమారుడిని బెదిరిస్తోన్న ఆడియో కలకలం సృష్టిస్తోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.