పవన్ కళ్యాణ్ అందరి హీరోల అభిమానులను కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారాహి యాత్రలో భాగంగా ప్రతీ సభలోనూ అందరి హీరోల గురించి మాట్లాడుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయా హీరోల ఫ్యాన్స్ పవన్ కి మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా పవన్ కి సపోర్ట్ గా నిలిచారు.
ప్రతీ హీరోకి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ హీరోల కోసం ఎంత దూరమైనా వెళ్లగలిగే బేస్మెంట్ ఉంది. ఫ్యాన్స్ అంటే వేరే హీరోని తక్కువ చేస్తూ, తమ హీరోనే హైలైట్ చేసుకునే రకంలా కాకుండా.. మిగతా హీరోల సినిమాలని చూస్తాము, మిగతా హీరోలను ఇష్టపడతాము అని చాటి చెప్పే అభిమానులు కూడా ఉంటారు. ఇటీవల ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ ఆత్మహత్య చేసుకుని చనిపోతే.. ఆ కుటుంబానికి అండగా నిలబడతామని తారక్ ఫ్యాన్స్ తో పాటు రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ముందుకొచ్చారు. శ్యామ్ చెల్లెలి పెళ్లి బాధ్యత మనది అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో రామ్ చరణ్ ఫ్యాన్స్ చేతులు కలిపారు. దీన్ని బట్టి ఫ్యాన్స్ కూడా ఎంత బాగా కలిసి ఉంటున్నారో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా పవన్ కోసం చేతులు కలిపారు. పవన్ కి మద్దతుగా నిలుస్తూ ముందుకొచ్చారు. భీమవరం సభలో పవన్ కోసం భారీగా ప్రభాస్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరలివచ్చారు.
ఉభయ గోదావరి జిల్లాలో వారాహి యాత్రతో పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నారు. సినిమా హీరోల ఫ్యాన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారాహి మొదటి విడత యాత్రలో ప్రతీ సభలోనూ టాలీవుడ్ హీరోల గురించి మాట్లాడుతూ వారి ఫ్యాన్స్ మనసు గెలుచుకున్నారు. తనకు ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా అందరు హీరోలు ఇష్టమే అని పవన్ అందరి హీరోల ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించారు. ఏ హీరోని అభిమానించినా గానీ మీ ఓటు నాకే వేయాలంటూ పవన్ కళ్యాణ్ పదే పదే ఫ్యాన్స్ ని అడుగుతున్నారు. ఇటీవల నరసాపురంలో ఏర్పాటు చేసిన సభలో ప్రభాస్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ జనసేనకు మద్దతు ఇవ్వాలని కోరారు పవన్ కళ్యాణ్. నా ఒక్కరి అభిమానులే నాకు సరిపోరని, అందరి హీరోల అభిమానులు ఏకం కావాలని అన్నారు.
ఈ క్రమంలో భీమవరంలో ఏర్పాటు చేసిన సభలో ఎన్టీఆర్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చారు. తారక్ ఫ్యాన్స్ ఐతే పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలతో కనువిందు చేశారు. ‘నేను ఎన్టీఆర్ అభిమాని.. కానీ ఒక మార్పు కోసం యుద్ధం చేయాల్సి వస్తే నీతోనే మా ప్రయాణం’ అంటూ తారక్ ఫ్యాన్స్ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఇదే సభలో ఆ మధ్య పవన్ ఫ్యాన్స్ కి, ప్రభాస్ ఫ్యాన్స్ కి మధ్య జరిగిన పోస్టర్ వివాదం గురించి స్పందించారు. పోస్టర్ వివాదం తనకు చాలా బాధ కలిగించిందని, ఎవరైనా పొరపాటున పోస్టర్ చింపేసినా క్షమించి అక్కడితో వదిలేయాలని అన్నారు. ఇంత పెద్ద గొడవ చేయకూడదని, చిన్న చిన్న గొడవలను పెద్దవి చేసుకోకూడదని అన్నారు. రెండు చేతులెత్తి మొక్కుతున్నా దయచేసి గొడవలు పెట్టుకోకండి అని అన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ప్రభాస్ అభిమానుల మనసులు గెలుచుకున్నారని అంటున్నారు.