తెలంగాణలో రాజకీయాలు మళ్ళీ రంగులు మారుతూ వర్ష కాలంలోను హీట్ పుట్టిస్తున్నాయి. ఇక నిన్న బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు సీనియర్ నాయకులు మోత్కుపల్లి నరసింహులు. రాజీనామా చేయడంతో పాటు తెలంగాణ బీజేపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇటీవల తెరాస పార్టీకి రాజీనామా చేసిన ఈటెల రాజేందర్ బీజేపీలో చేరిన విషయమ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటెల చేరికపై నా అభిప్రాయాన్ని అడగలేదని మోత్కుపల్లి అన్నారు. ఇక పార్టీలోకి సీనియర్ నేతలకు సరైన స్థానం లేదని తెలిపారు.
మరీ ముఖ్యంగా ఈటెల రాజేందర్ పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటెల అవినీతి పరుడని, భూ కబ్జా కోరంటూ మోత్కుపల్లి నరసింహాలు మండిపడ్డారు. దళిత, దేవాలయ భూములను అక్రమంగా సంపాదించుకున్నారని అన్నారు. మొదట్లో ఏమి ఆస్తులు లేని ఈటెల ఇప్పుడు ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలపాలని ప్రశ్నించారు. ఇక ఈ తాజాగా మోత్కుపల్లి వ్యాఖ్యల పట్ల స్పందించారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్.ఇక మోత్కుపల్లి పేరును వాడటం నాకు ఇష్టం లేదని, నా దగ్గర అక్రమంగా సంపాదించిన ఎకరా భూమి ఉన్నా నా ముక్కు నెలకు రాస్తానని అన్నారు.
ఇప్పటికైనా ఏ ఎంక్వైరీ అయినా నేను సిద్దమేనని మరో సారి తెలిపారు. ఇక కిరాయి మనుషులతో డబ్బులిచ్చి నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఈటెల మండిపడ్డారు. నన్ను చంపాలని నయీంలాంటి గుండాలతో బేరసారాలు జరిపారని, వాటికి భయపడని నేను ఇలాంటి చిల్లర రాజకీయాలకు భయపడనని అన్నారు ఈటెల. ఇక తెలంగాణ సమయంలో ఎన్ని కష్టాలు పడ్డామో ప్రజలకు తెలుసన్నారు. అతి తక్కువ కాలంలోనే ఎన్నో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచానని గుర్తు చేశారు.