సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, తెరాస సవాళ్లు, ప్రతిసవాళ్లపై ఆయన స్పందించారు. దమ్ముంటే తనను టచ్ చేయాలని సీఎం కేసీఆర్ విసిరిన సవాలుపై బీజేపీ నేతలు స్పందించాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ‘సీఎం కేసీఆర్ అవినీతి తెలుసని, జైల్లో పెడతామంటూ బండి సంజయ్ అంటున్నారు. నన్ను జైల్లో పెడతారా? దమ్ముంటే టచ్ చేయండి అంటూ కేసీఆర్ సవాస్ చేస్తున్నారు. టచ్ చేయమంటున్నారు కదా.. బండి సంజయ్ టచ్ చేయ్’ అంటూ మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. అవన్నీ నాటకాలని.. వాటిని రాష్ట్ర ప్రజలు నమ్మకండని భట్టి సూచించారు. యాసంగిలో వరి సాగు చేయకండని చేసిన వ్యాఖ్యలపై భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగిలో వరి వేయకండని సీఎం చెప్పడమేంటని ప్రశ్నించారు. కేంద్రం కొనట్లేదు కాబట్టి తాను కొననంటే ఎలా అంటూ వ్యాఖ్యానించారు.
‘ఏడేళ్లుగా నీటి వాటాల్లో బీజేపీ అన్యాయం చేస్తోందని కేసీఆర్ చెబుతున్నారు. మరి ఏడేళ్లుగా నీళ్లు ఇవ్వకుండా ఉంటే ఇన్నాళ్లు ఎందుకు మాట్లాడ లేదు?’ అంటూ తీవ్రంగా ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ అంశంపై కూడా భట్టి స్పందించారు. వ్యాట్ తాను పెంచలేదు కాబట్టి తగ్గించను అనడం.. సరైంది కాదని భట్టి అభిప్రాయపడ్డారు. కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించాలని భట్టి విక్రమార్క అన్నారు. అలాగే పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోనికి తీసుకురావాలని భట్టి డిమాండ్ చేశారు.