తెలంగాణలో గత కొంతకాలంగా రాజకీయాలు బాగా వేడెక్కి పోతున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ కి గుడ్ బాయ్ చెప్పి బీజేపీ కండువ కప్పుకున్నారు. దాంతో హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఇటీవల తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికతోపాటు ఏపీలోని బద్వేల్ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది.
అక్టోబర్ ముప్పైన ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యుల్ వెల్లడించింది. దాంతో ఇప్పుడు తెలంగాణ రాజకీయ పార్టీలు అన్ని హుజూరాబాద్ పై ఫోకస్ పెట్టాయి. ఇదిలా ఉంటే నిన్నటితో హూజూరాబాద్ లో నామినేషన్ల గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ నామినేషన్ వేశారు. రాజేందర్‌తోపాటు హుజురాబాద్ ఉపఎన్నిక ఇన్చార్జ్ జితేందర్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలూ వెళ్లారు. అనంతరం, ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు..హుజురాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు బీజేపీ కేంద్ర, రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలిపారు.
ఇప్పుడు హుజూరాబాద్ లో ఈటెలకు కొత్త తలనొప్పి వచ్చినట్టు టాక్ వినిపిస్తుంది. చివరి రోజున రాజేందర్ పేరుతో ఉన్న మరో ముగ్గురు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. వారి ఇంటి పేర్లు కూడా ఈటల మాదిరిగానే ఈ అనే అక్షరంతో ప్రారంభమయ్యాయి. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఇమ్మడి రాజేందర్, న్యూ ఇండియా పార్టీ నుంచి ఈసంపల్లి రాజేందర్, ఆల్ ఇండియా బీసీ ఓబీసీ పార్టీ నుంచి ఇప్పలపల్లి రాజేందర్ పోటీలో ఉన్నారు. దీంతో ఓట్లు ఎక్కడ చీలిపోతాయోనన్న ఆందోళన ఇప్పుడు బీజేపీ వర్గాల్లో మొదలైంది. ఈ నెల 7వ తేదీ వరకు 15 మంది నామినేషన్లు వేయగా, చివరి రోజైన నిన్న 46 మంది కలిపి మొత్తంగా 61 మంది నామినేషన్లు దాఖలు చేశారు.