రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో ఉంది. కాంగ్రెస్ పార్టీపై ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలపై భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసేందుకు రేవంత్ రెడ్డి ఆలయానికి చేరుకున్నారు.
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరంటే ఒకరు ఢీ అంటే ఢీ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈటల రాజేందర్.. రేవంత్ రెడ్డి మీద చేసిన ఆరోపణల నేపథ్యంలో రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ నుంచి రూ. 25 కోట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయని ఈటల రాజేందర్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. కాంగ్రెస్ కు కేసీఆర్ రూ. 25 కోట్లు ఇచ్చారని ఈటల రాజేందర్ నిరూపించేందుకు సిద్ధమేనా అంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేయడానికి నేను వస్తున్నా, నువ్వు వస్తావా అంటూ ఈటల రాజేందర్ కి సవాలు విసిరారు.
అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసేందుకు రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకున్నారు. కార్యకర్తలను వెంటబెట్టుకుని భారీ కాన్వాయ్ తో జూబ్లీహిల్స్ నివాసం నుంచి నేరుగా ఛార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారి ఆలయంలో పూజలు చేయనున్నారు. అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆధారం లేని వాటికి భాగ్యలక్ష్మి అమ్మవారే సాక్ష్యమని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసునని, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఉప ఎన్నికల సమయంలో వందల కోట్లు ఖర్చు పెట్టాయని ఆరోపించారు. మునుగోడులో 300 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని అన్నారు.
గతంలో పాల్వాయి చేసిన సవాలకు బీజేపీ పార్టీ గానీ, బీఆర్ఎస్ పార్టీ గానీ స్పందించలేదని అన్నారు. పాల్వాయి స్రవంతి ఒక్క రూపాయి పంచకుండా ప్రజా తీర్పు కోరిందని అన్నారు. ఒక్క రూపాయి పంచకపోయినా గానీ పాల్వాయి స్రవంతికి 25 వేల ఓట్లు వచ్చాయని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పాల్వాయి స్రవంతి కోసం తాను కేసీఆర్ సహాయం తీసుకుని ఉంటే గనుక.. తాను, తమ కుటుంబాలు సర్వ నాశనం అయినా పర్లేదు.. ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి మీద ఒట్టేసి కేసీఆర్ తో ఎలాంటి లాలూచీ లేదు. రాజీ నా రక్తంలోనే లేదు, భయం తన ఒంట్లోనే లేదు .. ఆఖరి బొట్టు వరకూ కేసీఆర్ తో కొట్లాడుతామని అన్నారు.