బెంగళూరు- దేశంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట అమాయకులైన అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలు తెచ్చినా అమ్మాయిలపై లైంగిక దాడులు మాత్రం ఆగడం లేదు. తాజాగా వెలుగులోకి వచ్చిన బాలికపై అత్యాచార ఘటన కలకలం రేపుతోంది.
అది రద్దీగా ఉన్న సంఘమిత్ర స్పెషల్ ఎక్స్‌ప్రెస్. బెంగళూరు నుంచి పాట్నావెళ్తోంది. రోటీన్ లో భాగంగా విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్ సిబ్బంది ట్రైన్‌లో ఒంటరిగా ఉన్న15 ఏళ్ల బాలిక భయంభయంగా ఉండటాన్ని గమనించారు. ఆ బాలిక ఏదో ప్రమాదంలో ఉందని గమనించిన ఆర్పీఎఫ్ పోలీసులు ఏంజరిగిందని ఆరా తీశారు. ఆ బాలిక చెప్పింది విని వాళ్లంతా నివ్వెరైపోయారు.
బీహార్‌లోని తూర్పు చంపారన్‌లోని మోతిహరి తన సొంత ప్రాంతమని ఆ బాలిక చెప్పింది. తన సొంత తండ్రి తనపై చాలా సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఏడుస్తూ చెప్పింది. అంతే కాదు తనకు నచ్చని వ్యక్తితో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండటంతో పారిపోయి వచ్చానని చెప్పుకొచ్చింది. తండ్రి చేస్తున్న అత్యాచారాల గురించి తన తల్లికి తెలిసినా పట్టించుకోలేదని వాపోయిందా బాలిక. నెల క్రితం ఇంటి నుంచి తప్పించుకుని బెంగళూరు వచ్చానని చెప్పింది.
ఈ క్రమంలో బెంగుళూరులో అమ్మాయిలను అక్రమంగా రవాణా చేసే ముఠాకు చిక్కిందట ఆ బాలిక. ఆ ముఠా వారంరోజుల పాటు ఆ బాలికను చీకటి గదిలో బంధించిందట. ఆమెకు బలవంతంగా మద్యం, మత్తు పదార్థాలు ఇచ్చారు. ఈ క్రమంలో వేరే ప్రాంతానికి రైలులో తరలిస్తుండగా ఎలాగోలా తప్పించుకున్నానని చెప్పుకొచ్చంది బాలిక. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆ బాలికను ఆస్పత్రికి తరలించారు రైల్వే పోలీసులు. అక్కడ ఆమెకు కొన్ని వైద్య పరీక్షలు చేయించాక చైల్డ్ వెల్ఫేర్ హోమ్‌కు తరలించారు.