సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా వైద్యశాస్త్రంలో టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. వైద్యులు ఇప్పటికే ఎన్నో అద్భుతమైన శస్త్రచికిత్సలు చేశారు. తాజాగా భారతదేశంలో మరో అద్భుతమైన ఆపరేషన్ ను వైద్యులు సక్సెస్ చేశారు. ఓ బాలుడికి తెగిపోయిన మర్మాంగాన్ని తిరిగి అతికించారు. అతను మళ్లీ ఎప్పటిలాగానే జీవితాన్ని కొనసాగించొచ్చని వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ శస్త్రచికిత్స వార్త వైరల్ గా మారింది. ఆ ఆపరేషన్ వివరాలు ఇలా ఉన్నాయి.
నైజీరియాకి చెందిన 12 ఏళ్ల బాలుడు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో బాలుడు తీవ్ర గాయాలకు గురయ్యాడు. ఆ ప్రమాదంలో అతని మర్మాంగం తెగిపోయింది. గత ఆరు నెలలుగా అతను అలాగే జీవనం సాగిస్తూ వచ్చాడు. సాధారణంగా మూత్ర విసర్జన చేయలేని పరిస్థితి. పాఠశాలకు కూడా ప్లాస్టిక్ బ్యాగ్ తగిలించుకుని వెళ్లేవాడు. బెంగళూరు వైద్యులు చేసిన ఈ శస్త్ర చికిత్స ఆ బాలుడి జీవితాన్నే మార్చేసింది. అతని జీవితం తిరిగి మామూలు స్థితికి చేరేలా చేసింది.
ఈ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలను బెంగళూరు ఫోర్టిస్ ఆస్పత్రి ఆంకాలజీ డిపార్ట్ మెంట్ హెడ్ కేశవముూర్తి వెల్లడించారు. ఈ సర్జరీ మొత్తం 3 దశల్లో ఉండనున్నట్లు తెలిపారు. ఇప్పటికే రెండు దశల్లో ఆపరేషన్ పూర్తి చేసి మూత్ర విసర్జన సాధారణంగా జరిగేలా చేశామన్నారు. ఆరునెలల తర్వాత మూడో దశ సర్జరీ చేసి మూత్రనాళాలను అమరుస్తామన్నారు. భవిష్యత్ లో ఆ బాలుడి వైవాహిక జీవితానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు.