టెక్నాలజీ డెస్క్- వాట్సాప్.. ఇప్పుడు ఇది లేని ప్రపంచాన్ని ఉహించుకోలేమంటే అతియోశక్తి కాదేమో. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు వాట్సాప్ ఉపయోగించకుండా ఏ పని జరగదు మరి. ఏదైనా సమాచారం పంపాలన్నా, ఫోటోలు, వీడియోలు పంపించాలన్నా వాట్సాప్ ఉండాల్సిందే. సరదాగా కబుర్లు చెప్పుకోవడం నుంచి మొదలు అధికారిక కార్యక్రమాలన్నింటికి వాట్సాప్ వాడుతున్నారు. ఈ నేపధ్యంలో వాట్సాప్ సైతం ఎప్పటికప్పుడు వినియోగదారులకు సరికొత్త ఫీచర్స్ ను అందిస్తోంది.
ఈ క్రమంలో వాట్సాప్ తాజాగా మాయమయ్యే ఫొటోల ఫీచర్ తీసుకొచ్చింది. మనం ఎవరికైనా ఓ ఫోటోను పంపామనుకోండి, వాళ్లు ఫొటో చూసిన తర్వాత చాట్ నుంచి బయటకు రాగానే ఆ ఫొటో ఇక కనిపించదన్నమాట. వ్యూ వన్స్ అనే ఈ ఫీచర్ తీసుకోస్తున్నట్లు గతంలోనే ప్రకటించిన వాట్సాప్, తాజాగా బేటా టెస్టర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలోనే వ్యూ వన్స్ ఫీచర్ యూజర్స్ కు అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ తెలిపింది.
వాబెటా ఇన్ఫో షేర్ చేసిన ఫొటోల ప్రకారం, ఈ వ్యూ వన్స్ ఫీచర్ వాడటం వేరీ సింపుల్ అని తెలుస్తోంది. మనం ఇతరులకు పంపాలనుకున్న ఫొటోలను యధావిధిగా గ్యాలరీ నుంచి ఎంపిక చేసుకోవాలి. అవతలివారికి పంపే ముందు గడియారం బొమ్మపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫోటోను అందుకున్న వారు ఒకసారి చూసిన తర్వాత ఈ ఫొటోలు మాయమైపోతాయి. ఈ వాట్సాప్ ఫీచర్ ఇన్స్టాగ్రామ్లో కనిపించే ఎక్స్పైరింగ్ మీడియా ఫీచర్లా ఉందని టేకీలు అంటున్నారు.