జీవితంలో ఏదో ఒక సమయంలో అదృష్టం అందరిని వరిస్తుంది. కానీ.., నిజాయతి మాత్రం అందరికీ సాధ్యం అయ్యేది కాదు. అలా బతకాలంటే స్వచ్ఛమైన మనసు ఉండాలి. సమాజం పట్ల, తోటి మనుషుల పట్ల దయాగుణం ఉండాలి. అచ్చం ఇలానే ఆలోచించాడు ఓ పోలీస్ కానిస్టేబుల్. రోడ్ పై దొరికిన లక్షల రూపాయల కన్నా, నిజాయతీగా బతకడమే తనకు ముఖ్యమనుకున్నాడు. ఆ డబ్బుని పోగొట్టుకున్న వారికి అందచేశాడు. విజయనగరంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్స్ అంతా ఆ కానిస్టేబుల్ ని రియల్ హీరో అంటూ కీర్తిస్తున్నారు. ఇంతకీ అసలు ఆ బ్యాగ్ ఎవరిది? అందులో ఏముందన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
విజయనగరంలోని లయన్స్ క్లబ్ వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పి.సురేశ్ కు రోడ్ పై ఓ బ్యాగ్ దొరకింది. ఆ బ్యాగ్ లో ఒక తులం బంగారు హారం, 16 తులాల వెండి పట్టీలు, రూ. 4 వేలు నగదు, రూ. 10 వేల విలువైన మొబైల్, ఏటీఎం కార్డులు.. ఇలా చాలానే ఉన్నాయి. ఇంత సొమ్ము అప్పనంగా దొరికితే ఎవరి మనసైన కాస్త చలించే ప్రమాదం ఉంది. కానీ.., కానిస్టేబుల్ సురేశ్ మాత్రం అలా ఆలోచించలేదు.
సురేశ్ తనకి బ్యాగ్ దొరికిన విషయాన్ని ట్రాఫిక్ డీఎస్పీకి తెలిపారు. తరువాత పోలీసుల విచారణలో ఆ హ్యాండ్‌బ్యాగ్ రాజీవ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న సోషల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్‌లో జూనియర్ సహాయకులుగా పని చేస్తున్న ప్రవీణ్ కుమార్ భార్యదిగా గుర్తించారు. ఇక వారి వద్దకి ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేశ్ స్వయంగా వెళ్లి బ్యాగ్‌ను అప్పగించడం విశేషం.
చేజారిపోయిందనుకున్న సొమ్ముని కానిస్టేబుల్ నిజాయతీగా తిరిగి తెచ్చివ్వడంతో ఆ కుటుంబ సభ్యలు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. బాధిత కుటుంబ సభ్యులు సురేశ్ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారులు, స్థానిక ప్రజలు ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేశ్ నిజాయతీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.