విజయ్ సేతుపతి, భారతీయ సినిమా నటుడు. ఆయన తమిళ, తెలుగు, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించాడు. విజయ్ తమిళంలో వచ్చిన ‘తెన్మెర్కు పరువాకత్రు’ సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. అంతకుముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. ఆయన తమిళంలో నిర్మాతగా, స్క్రీన్ ప్లే రచయితగా, పాటల రచయితగా, గాయకుడిగా కూడా కొన్ని సినిమాలకు పనిచేశాడు. తెలుగులో ఇప్పటి వరకు ఉప్పెన, సైరా నరసింహారెడ్డి సినిమాల్లో నటించాడు. అలాగే విజయ్ సేతుపతి నటించిన తమిళ చిత్రాలన్నీ తెలుగులోకి అనువాదమవుతున్నాయి. అలా విజయ్ సేతుపతి ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడే. పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’లోనూ విజయ్ సేతుపతి నటించాల్సింది. కానీ డేట్స్ అడ్జస్ట్ కాలేదు. ఇప్పుడు మరో తెలుగు సినిమా దర్శకుడు సేతుపతిని తన సినిమాలో నటించమని సంప్రదించాడు. కథను వినిపించాడు. విజయ్ సేతుపతికి కథ నచ్చింది.
అయితే ఇప్పటికే చాలా తమిళ సినిమాలను కమిట్ అయ్యి ఉన్నాడు. డేట్స్ అడ్జస్ట్ అయితే తప్పకుండా నటిస్తానని సదరు డైరెక్టర్‌తో విజయ్ సేతుపతి అన్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతా ఓకే అయితే ఈ తెలుగు దర్శకుడు సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రూపొందించేలా ప్లాన్ చేసుకున్నాడు. ఇంతకీ ఆ సినిమా డైరెక్టర్ రమేశ్ వర్మ. క్రైమ్ థ్రిల్లర్ రాక్షసుడుని తెరకెక్కించిన ఈయన దానికి సీక్వెల్‌గా ‘రాక్షసుడు2’ చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.