హైదరాబాద్- సాధారనంగా అధికార పార్టీ నేతలు తమ ప్రభుత్వాన్ని పొగుడుకుంటూ ఉంటారు. తమ సర్కార్ పై ఎవరైనా చిన్న మాట అంటే వెంటనే ధిటుగా సమాధానం చెబుతుంటారు. ప్రతిపక్ష పార్టీలు ఏమైనా ఆరోపణలు చేస్తే ఒంటికాలుపై లేస్తారు. కానీ చాలా అరుదుగా సొంత పార్టీపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. కానీ ఈ సారి మాత్రం టీఆర్ ఎస్ ప్రభుత్వ పనితీరుపై ఆ పార్టీ ఎమ్మెల్సీ పెదవి విరవడం ఆసక్తికరంగా మారింది.
ఇలా కేసీఆర్ ప్రభుత్వంపై ఎవరో మాట్లాడి ఉంటే అంతగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదనుకొండి. కానీ మాట్లాడింది ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత. అవును టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ సర్కార్ పనితీరుపై కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు టీఆర్ ఎస్ పార్టీతో పాటు, ప్రతిపక్ష పార్టీల్లో చర్చనీయాంశమవుతోంది.
శాసనమండలి సమావేశాల్లో సోమవారం మొట్టమొదటి సారి మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ ప్రభుత్వ పనితీరుపై పెదవి విరిచారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై శాసనమండలిలో ఆమె కేసీఆర్ సర్కార్ ను నిలదీశారు. ప్రజా ప్రతినిధులకు కూర్చోవడానికి కనీసం కుర్చీ లేదని సూటిగా ప్రశ్నించారు. పంచాయతీరాజ్ మంత్రి చొరవ తీసుకుని దీనికి పరిష్కారం చూపాలని కవిత డిమాండ్ చేశారు.
తెలంగాణలో కొత్తగా మండలాలు ఏర్పాటైనా ఎంపీపీలకు తగిన కార్యాలయాలు లేవని, రోజువారీ అధికారిక విధుల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని వారికి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఏదేమైనా కవిత వ్యాఖలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.