ఉత్త్రర్ ప్రదేశ్- మన దేశంలో పెద్ద పెద్ద వ్యాపారులు చేసే వారికంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారే ఎక్కువ. బడా వ్యాపారులు కోట్లల్లో బిజినెస్ చేస్తే, చిరు వ్యాపారులు రూపాయల్లో బిజినెస్ చేస్తుంటారు. ఐతే చిన్న వ్యాపారులు కూడా బాగానే సంపాదిస్తుంటారని వేరే చెప్పక్కర్లేదు. చిన్న వ్యాపారాల్లోనే ఎక్కువ ఆదాయం ఉంటుందని చాలా సందర్బాల్లో నిరూపితం అయ్యింది. ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్ లో ఆదాయపు పన్ను శాఖ తనిఖీల్లో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్సూర్‌లో రోడ్డు పక్కన బడ్డీ కొట్టు పెట్టుకుని పాన్, సమోసా, చాట్ మొదలైనవి అమ్మే 256 మంది చిరు వ్యాపారులు కోటీశ్వరులయ్యారని ఆదాయపు పన్నుశాఖ తనిఖీలలో తేలింది. ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన బిగ్ డేటా సాఫ్ట్‌వేర్, జీఎస్టీ రిజిస్ట్రేషన్ తనిఖీలలో 256 మంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే పేదలు కోటీశ్వరులుగా మారారని తేలింది.
కాన్పూర్ లో రోడ్డు పక్కన పాన్ డబ్బా, సమోసా, పానీ పూరి వ్యాపారం సాగించే చిరు వ్యాపారులు కోటీశ్వరులుగా మారారు. ఐతే వీరిలో ఒక్కరు కాడూ ఆదాయపు పన్ను గానీ, జీఎస్టీ గానీ చెల్లించడం లేదు. వీరి ఉదంతం తరువాత ఆదాయపు పన్ను శాఖ ఇటువంటి వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. రోడ్డు పక్కన చిల్లర వ్యాపారాలు చేస్తున్న వారంతా భారీగా సంపాదిస్తున్నప్పటికీ ఆదాయపు పన్ను, జీఎస్టీ చెల్లించకుండా ఇంకా పేదలుగానే చలామణి అవుతూ తప్పించుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు.
అక్కడే కాన్పూర్ లో రోడ్లపై పళ్లు అమ్మే చిరు వ్యాపారులు సైతం భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆదాయపు పన్ను శాఖ తనిఖీల్లో తేలిందట. ఇక కొస మెరుపు ఏంటంటే ఆదాయపు పన్ను శాఖ గుర్తించిన ఈ 256 మంది చిరు వ్యాపారులను కోట్ల రూపాయల ఆస్తులు, ఒక్కొక్కరి దగ్గర 3 నుంచి 4 కార్లు, విలాసవంతమైన ఇళ్లు ఉన్నట్లు తేలడంతో నోరెళ్లబెట్టారట.