ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా అరవై ఏళ్లు బతికితే గొప్పే మరి. వందేళ్లు బతికిన వారిని చూస్తే ఔరా అనిపిస్తుంది. ఇన్నేళ్లు ఎలా జీవించారు రా అని వింతగానూ చూస్తారు. ఓ బామ్మ వందేళ్లు బతకడమే కాదూ..ఇప్పుడు వార్తల్లోనూ నిలిచింది. వందేళ్లు బతికినందుకు ఆమె సెంటరాఫ్ ఎట్రాక్షన్ కాలేదు.
40 ఏళ్లు బతికితే చాలురా దేవుడా అనుకుంటున్న కాలం. ఒక వేళ బతికితే మందులతో శరీరం అనే బండిని నెట్టుకురావాల్సిందే. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా అరవై ఏళ్లు బతికితే గొప్పే మరి. కానీ వందేళ్లు బతికిన వారిని చూస్తే ఔరా అనిపిస్తుంది. ఇన్నేళ్లు ఎలా జీవించారు రా అని వింతగానూ చూస్తారు. ఓ బామ్మ వందేళ్లు బతకడమే కాదూ..ఇప్పుడు వార్తల్లోనూ నిలిచింది. వందేళ్లు బతికినందుకు ఆమె సెంటరాఫ్ ఎట్రాక్షన్ కాలేదు. కొన్ని ఆరోపణలపై ఆమెపై పోలీసు కేసు నమోదైంది. ఓ వివాదం విషయంలో కళ్లు సరిగ్గా కనిపించని వృద్ధురాలిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇంతకు ఆమె చేసిన నేరమేమిటంటే.. కృష్ణ, రామ అంటూ అనుకోవాల్సిన సమయంలో రౌడీయిజం చెలాయించి.. ఓ మహిళను బెదిరించిందన్న ఫిర్యాదు అందడంతో పోలీసులు ఈ పని చేయాల్సి వచ్చింది.
కాటికి కాలు చాపాల్సిన వయస్సులో దందా షురూ చేస్తూ పోలీసుల దృష్టిలో పడింది వందేళ్ల బామ్మ చంద్రకాళి. ఇంతకు ఈ గడుసు బామ్మ.. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో నివసిస్తోంది. కళ్లు సరిగా కనిపించని, నడవడం సరిగ్గా రాని 100 ఏళ్ల వృద్ధురాలు.. ఓ మహిళను బెదిరించిందట. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. కాన్పూర్ మీర్జాపూర్‌లోని నాయిబస్తీ నివాసి అయిన చంద్రకాళి కుటుంబం, మాధురి అనే యువతికి మధ్య భూవివాదం నడుస్తోంది. ఫ్లాట్ తన పేరు మీద ఉండగా.. చంద్రకాళి కుటుంబ సభ్యులు నకిలీ పత్రాలు సృష్టించి,భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారని మాధురి ఆరోపించింది. ఈ నెల 6న గేటు పగులగొట్టి తన ఫ్లాట్లోకి ప్రవేశించారని ఆరోపిస్తూ చంద్రకాళితో పాటు ఆమె కుటుంబ సభ్యులపై మాధురి ఫిర్యాదు చేసింది. తర్వాత మాధురి.. తన భర్తతో కలిసి తన ఫ్లాట్‌లో నిర్మాణ పనులు చేపట్టగా.. సుమారు డజను మంది మనుషులతో వచ్చి రౌడీయిజం చేసి దాడి చేయించారని ఆరోఫించింది.
దందా నడుపుతూ.. కొంత మంది రౌడీమూకలను ఇంటి మీదకు పంపడమే కాకుండా.. ఇళ్లు కట్టుకోవాలంటే 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని మాధురి పేర్కొంది. ఇవ్వకుంటే ఇల్లు కట్టుకోనివ్వమని, ఫ్లాటుతో పాటు ప్రాణాలు పోతాయని బెదిరించారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. ఆమె ఫిర్యాదుతో చంద్రకాళి కూతురు మమతా దూబేతో పాటు సుష్మా తివారీ, క్రిష్ణ మురారిలపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. వృద్ధురాలిపై కేసు విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎఫ్ఐఆర్ నుంచి ఆమె పేరును తొలగించారు. వృద్ధరాలు తన వాదనల్ని కమీషనర్ బీపీ జోగ్ దండ్ ముందు వినిపించింది. ఇరు పక్షాలు కూడా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారని, విచారణ జరుపుతున్నామని అన్నారు.