విశాఖపట్నం- గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోను వాతావారణం చల్లగా ఉంది. మొన్న వచ్చిన తౌక్టే తుఫాను ప్రభావంతో వర్షాలు కూడా కురిశాయి. వానలతో కొంత మేర నగరాలు, పట్టణాల్లో అహ్లాదకరంగా అనిపించినా.. గ్రామాల్లో మాత్రం అకాల వర్షాలతో రైతులు పండించిన పంటలు నాశనం అయ్యాయి. ఇక ఇప్పుడు మరో తుఫాను యాస్ దూసుకువచ్చింది. ఈ సైక్లోన్ ప్రభావంతో తీర ఉత్తర తీర ప్రాంత రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ పై యాస్ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది. ఐతే నిన్నటి వరకు అడప దడపా వానలతో చల్లగా ఉన్న వాతావరణం మళ్లీ వేడెక్కనుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానంగా ఆంద్రప్రదేశ్ లో ఎండ తీవ్రత పెరగనుందని ఐఎండీ స్పష్టం చేసింది. ఏపీలోని కోస్తాలో బుధవారం నుంచి ఎండ తీవ్రత పెరగనున్నదని వాతావరణ శాఖ పేర్కొంది. తూర్పుగోదావరి నుంచి గుంటూరు వరకు 4 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి.
గురువారం నుంచి ఇటు శ్రీకాకుళం నుంచి అటు నెల్లూరు జిల్లా వరకూ ఎండలు పెరుగుతాయని, పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదుకానున్నాయని ఐఎండీ అధికారులు తెలిపారు. ప్రధానంగా గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని స్పష్టం చేశారు. బంగాళాఖాతంలో అతితీవ్ర తుఫాన్ యాస్ బుధవారం తీరం దాటిన తరువాత కోస్తాలో మూడు, నాలుగు రోజుల పాటు ఎండల తీవ్ర ఉంటుందని చెప్పారు. ఐతే బుధవారం ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడవచ్చని, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక సకాలంలోనే రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించనున్నాయని ఇప్పటికే భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈ సారి దేశంలో సాధారణ వర్షాలు కురుస్తాయాాని ఐఎండీ ప్రకటించింది.