రాబోయే మూడు రోజుల్లో ఏపీలోని ఈ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. తీవ్ర వడగాల్పులతో కూడిన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్ లో రాబోయే మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆదివారం 176 మండలాల్లో వడగాల్పుల తీవ్రత సాధారణంగా ఉంటుందని.. 136 మండలాల్లో మాత్రం ఆ తీవ్రత అధికంగా ఉంటుందని హెచ్చరించింది. సోమవారం ఐతే 153 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయని.. 132 మండలాల్లో ఆ తీవ్రత సాధారణంగా ఉంటుందని హెచ్చరించింది. ఆదివారం నాడు ప్రకాశం, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ఏలూరు, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఇక కర్నూలు, వైఎస్ఆర్, నంద్యాల, శ్రీకాకుళం, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. సోమవారం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
మంగళవారం కూడా ఇవే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి, మండల అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు విపత్తుల సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ సూచించింది. ఏదైనా సమాచారం కోసం 1070, 112, 1800 4250101 టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచింది.